తెలంగాణ

Gadwal: రైల్వే హబ్‌గా గద్వాల జిల్లా.. రూ.42కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రచన: NK11 నిమిషాల పఠనం

Gadwal: అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరైన రూ.42.82 కోట్ల నిధులతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం గద్వాల రైల్వే స్టేషన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి కేంద్రమంత్రి పరిశీలించారు.

Gadwal: అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరైన రూ.42.82 కోట్ల నిధులతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం గద్వాల రైల్వే స్టేషన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి కేంద్రమంత్రి పరిశీలించారు.

స్టేషన్ అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్లాట్ ఫామ్ పై తిరుగుతూ తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైలులోని ప్రయాణికులకు అభివాదం చేశారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైనుంచి స్టేషన్ పరిసరాల్లో జరుగుతున్న పనులను గమనించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

గద్వాల రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ పథకం పనులు పూర్తయితే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న రైళ్లకు అదనంగా ఇతర రైళ్ల స్టాపింగ్ కు కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్టేషన్ లో ప్లాట్ ఫామ్ విస్తరణ, పార్కింగ్ అభివృద్ధి, నూతన పరిపాలన భవనం, గద్వాల సంస్థానం సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా ముఖద్వార నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. స్టేషన్ వెనుక వైపు నుంచి కూడా రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులకు సౌకర్యంగా మరో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రైల్వే హబ్ గా జోగులాంబ గద్వాల జిల్లా

రైల్వే హబ్ గా జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధి చెందుతుందనటంలో అతిశయోక్తి లేదన్నారు. గద్వాల రైల్వే స్టేషన్ ప్రారంభమై వందేళ్లు దాటడంతో అమృత్ భారత్ పనులు పూర్తయ్యాక జిల్లా ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

రైల్వేకి సంబంధించి గడిచిన పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను మంజూరు చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులను ప్రయాణికులకు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి అప్పటి ప్రభుత్వాలు ఏడాదికి రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి రూ.5454 కోట్ల నిధులను ఒక్క తెలంగాణకే కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.

21 రైల్వే ప్రాజెక్టులకు రూ.50వేల కోట్లు

రాష్ట్రంలో 2009-2014 సంవత్సరాల మధ్యన కేవలం 87 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు జరిగితే ప్రస్తుతం 888 కిలోమీటర్ల లైనింగ్ పనులు చేపట్టడం గర్వకారణమన్నారు. 21 రైల్వే ప్రాజెక్టులకు రూ.50 వేల కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 520 ఆర్ఓబి, ఆర్ యుబి నిర్మాణాలను పూర్తి చేశామని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4883 కోట్ల నిధులతో 118 రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నామన్నారు. గద్వాలలో రూ.66 కోట్ల నిధులతో మరో ఆర్ఓబి నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో 99 శాతం రైల్వే ట్రాక్స్ ను విద్యుద్దీకరించడం జరిగిందని, 100 కొత్త రైళ్లను ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 174 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పించామన్నారు. కాజీపేటలో నూతన సాంకేతికతను వినియోగించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రైళ్ల బోగీల తయారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. రైల్వే ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోందని, దేశవ్యాప్తంగా కవచ్ టెక్నాలజీనీ అందుబాటులోకి తెచ్చామన్నారు.

హైదరాబాద్ కు పెట్టుబడుల వెల్లువ

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏడు బుల్లెట్ రైళ్లను ప్రకటిస్తే అందులో తెలంగాణ రాష్ట్రానికే మూడింటిని కేటాయించడం గర్వకారణంగా ఉందన్నారు. వీటిని హైదరాబాద్ నుంచి పుణె, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు నడపడంతో రాష్ట్రం గేమ్ చేంజర్ గా మారుతుందని చెప్పారు. హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, దాంతో వివిధ ప్రాంతాలకు తక్కువ సమయంలోనే ప్రయాణికులు రాకపోకలు సాగించే వెసులుబాటు కలుగుతుందని ఫలితంగా హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్త పెట్టుబడులు పెరుగుతాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఎయిర్ పోర్టును తలపించేలా ఆధునికీకరణ పనులు

అలంపూర్ ఆలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని, ఫలితంగా భక్తుల సంఖ్య కూడా పెరగడంతో క్షేత్ర విశిష్టత ఇనుమడిస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. విమానాశ్రయాలను తలపించేలా గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. వందేళ్లు పూర్తి చేసుకున్న గద్వాల రైల్వే స్టేషన్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

గద్వాల రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు స్టాపింగ్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే అన్ని రైళ్లు ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. గద్వాల-డోర్నకల్, మాచర్ల-గద్వాల రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమయ్యేలా ప్రయత్నిస్తానన్నారు. డబ్లింగ్ పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు.

స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి

గద్వాల సంస్థానాధీశులు ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణానికి 100 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించడంతో మిగిలిన స్థలంలో భవిష్యత్తులో రైల్వే ప్రాజెక్టులను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోరారు. గద్వాల పేరు చెప్పగానే మొదట ఇక్కడి చేనేత జరీ చీరలు గుర్తొస్తాయని, రైల్వే కనెక్టివిటీ సౌకర్యాలు మెరుగుపడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గద్వాల జిల్లా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంతర్ రాష్ట్ర సరిహద్దుగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న వాహనాల పార్కింగ్ స్టాండ్ లో ప్రయాణికుల నుంచి అధిక రుసుములను వసూలు చేయడం తగదని, తగ్గించాల్సిందిగా రైల్వే అధికారులను కోరారు. గద్వాల రైల్వే స్టేషన్ లో అన్ని రైళ్ళను ప్రయాణికులు సద్వినియోగం చేసుకునేలా స్టాపింగ్ ఉండాలన్నారు. ఆధునికీకరణకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు. అలాగే పలువురు ప్రజా సంఘాల నేతలు గద్వాల ప్రాంత అభివృద్ధిని కోరుతూ మంత్రికి వినతి పత్రాలను అందించారు.

#Gadwal#Gadwal District#Gadwal Railway Station#Dk Aruna#Kishan Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి