ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మక చర్యలు క్షేత్రస్థాయిలో విశేష ఆదరణ పొందుతున్నాయి. రాష్ట్రానికి ఎంతో బలమైన సుదీర్ఘ తీరప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు వేగంగా అమలవుతున్నాయి. ఈ క్రమంలో బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సూర్యలంక బీచ్‌లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ఇటీవల ఈ బీచ్‌ను సందర్శించిన ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ఇక్కడి ప్రకృతి అందాలకు, మౌలిక వసతులకు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపించారు.
శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, నటుడు రాజారవీంద్ర మరియు ఇతర చిత్ర బృందంతో కలిసి శ్రీకాంత్ సూర్యలంక బీచ్‌లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ 'స్వదేశీ దర్శన్ 2.0' పథకం కింద రూ.97.52 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం యాగంటి రిసార్ట్స్‌లో సమావేశమై, తీరప్రాంతంలో బోటు షికారు చేస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్, సూర్యలంక బీచ్ గోవాను మరిపించేలా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాపట్ల - చీరాల మధ్య ఇంతటి అద్భుతమైన, ప్రశాంతమైన ప్రదేశం ఉందని తాము ఊహించలేదని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇక్కడి కాటేజీలు, రిసార్ట్స్ ఫైవ్ స్టార్ రేంజ్ సౌకర్యాలతో ఉన్నాయని, ఆహార పదార్థాల నాణ్యత కూడా చాలా బాగుందని కొనియాడారు. సినిమా షూటింగ్‌లకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు. తాము సాధారణంగా విహారయాత్రల కోసం గోవాకు వెళ్తుంటామని, అయితే ఇక్కడి అభివృద్ధి, సౌకర్యాలు చూసిన తర్వాత ఇకపై గోవాకు బదులు తరచూ సూర్యలంక బీచ్‌కే వస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూర్యలంక తీరాన్ని అంతర్జాతీయ టూరిజం డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ సూర్యలంక-చీరాల ప్రాంతాన్ని ఒక సమగ్ర పర్యాటక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పర్యాటకుల రాకపోకలను సులభతరం చేసేందుకు అవసరమైతే చీరాల సమీపంలో ఒక చిన్న విమానాశ్రయం (ఎయిర్‌స్ట్రిప్) కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపడుతుండటంతో సూర్యలంక త్వరలోనే ప్రముఖ టూరిజం స్పాట్‌గా మారనుంది.









