ఈపీఎఫ్ఓ (EPFO) ఉద్యోగుల సౌకర్యార్థం డిజిటల్ సేవలను మరింత వేగవంతం, పారదర్శకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూఏఎన్ (UAN) యాక్టివేషన్, కొత్త యూఏఎన్ జనరేషన్ ప్రాసెస్ కోసం అధికారిక పీఎఫ్ పోర్టల్‌ను ఉపయోగించే అవకాశం లేకుండా చేసింది. ఈ సేవలను పీఎఫ్ వెబ్‌సైట్ నుంచి పూర్తిగా తొలగించి, కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'ఉమాంగ్' (UMANG) యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంచేలా మార్పులు చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారైనా లేదా ఇప్పటికే పీఎఫ్ ఖాతా ఉండి యాక్టివేట్ చేసుకోని వారైనా తప్పనిసరిగా ఉమాంగ్ యాప్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
నూతన నిబంధనల ప్రకారం ఉమాంగ్ యాప్‌లో భద్రతను పెంచేందుకు ఆధార్ ఆధారిత 'ఫేస్ ఆథెంటికేషన్' (Face Authentication) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా యూఏఎన్ నంబర్ పొందాలనుకునే వారు లేదా ఉన్న యూఏఎన్‌ను యాక్టివేట్ చేయాలనుకునే వారు ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో ఈపీఎఫ్ఓ సేవలను ఎంచుకోవాలి. అనంతరం ఆధార్, మొబైల్ నంబర్లను నమోదు చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత 'ఆధార్ ఫేస్ ఆర్డీ' (Aadhaar FaceRD) యాప్ ద్వారా ప్రత్యక్షంగా ముఖాన్ని స్కాన్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఫేస్ స్కాన్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన వెంటనే అభ్యర్థికి కొత్త యూఏఎన్ నంబర్ జనరేట్ అవుతుంది లేదా పాత యూఏఎన్ క్షణాల్లో యాక్టివేట్ అవుతుంది. సంబంధిత వివరాలు వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎమ్‌ఎస్ రూపంలో వెంటనే చేరుతాయి. పీఎఫ్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, సర్వర్ ఆలస్యం వంటి ఇబ్బందులను అధిగమించి, సులభంగా సర్వీసులు పొందేందుకు ఈ ముఖ గుర్తింపు విధానం ఎంతో ఉపయోగపడుతుందని ఈపీఎఫ్ఓ అధికారులు తెలిపారు.
యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగులు ఉమాంగ్ యాప్ ద్వారానే తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, పాస్‌బుక్ డౌన్‌లోడ్, పీఎఫ్ క్లెయిమ్‌లు, అడ్వాన్స్ విత్‌డ్రావల్స్ వంటి అన్ని డిజిటల్ సేవలను అత్యంత వేగంగా పొందవచ్చు. ప్రతిసారి కంప్యూటర్ లేదా మీసేవ కేంద్రాలకు వెళ్లే పనిలేకుండా మొబైల్‌లోనే అన్ని సేవలు అందుబాటులోకి రావడంతో పీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








