శీతాకాలం ప్రారంభం కావడంతో యూరప్ దేశాలు పొగ మంచు వలయంలో చిక్కుకుంటున్నాయి. వింటర్‌లో ఆయా దేశాల్లో తీవ్ర మంచు తుఫానులు వస్తుంటాయి. నిత్యం మంచు పడుతుంటంతో అక్కడంతా చల్లని వాతావరణం నెలకొంటుంది.ఫలితంగా మధ్యాహ్నం సమయంలోనూ రోడ్లు బ్లాక్ అవుతుంటాయి.ఇక ఉదయం సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు.
పొగమంచు కారణంగా ఎదురుగా వెళ్తున్న, అవతలి నుంచి వస్తున్న వాహనాలు కూడా కనిపించవు.మొత్తం దారి అంతా కారు మంచుపొగ కమ్ముకంటుంది. ఫలితంగా పెను ప్రమాదాలు సంభవిస్తుంటాయి. తాజాగా పొగ మంచు కారణంగా యూరప్ ఖండంలోని ఓ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
బల్గేరియా దేశ రాజధాని సోఫియాను బుర్గాస్ ఓడరేవుతో కలిపే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో యాంబోల్ సమీపంలో ఈ వాహనాలు ఢీకొన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో 86 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనగా 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వల్లే ఇరువైపులా ఒకే ప్రదేశంలో ఒకదాంతో మరొకటి 86 వాహనాలు ఢీకొట్టుకున్నట్టు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరో 46 మంది గాయపడగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


