కార్పొరేట్ కంపెనీల చుట్టూ స్పై వల
ఎన్విడియాలో కలకలం..
జెన్సన్ చుట్టూ అనుమానాలు
ఆలిస్ హువాంగ్ ఎవరు..?
సీఈఓలే టార్గెట్.. కంపెనీల రహస్యాలే లక్ష్యం
ప్రపంచ ఏఐ రంగాన్ని శాసిస్తున్న ఎన్విడియా ఇప్పుడు చైనా స్పై ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ఒక చైనా వ్యాపారవేత్తకు ఉన్న పరిచయం.. ఆమెకు చైనా నిఘా సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానాలు.. చైనాకు చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల రూపాయల విలువైన ఏఐ చిప్స్. ఇప్పుడు ఇది వ్యక్తిగత వ్యవహారాన్ని దాటి అమెరికా జాతీయ భద్రత, అంతర్జాతీయ టెక్నాలజీ పోరుగా మారింది.
వ్యక్తిగత పరిచయమా.. అంతర్జాతీయ స్పై ఆపరేషనా?
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ మొదలైన వివాదం క్రమంగా అమెరికా జాతీయ భద్రత, చైనా చిప్స్ వ్యూహం, అంతర్జాతీయ వ్యాపార సంబంధాల వరకు విస్తరించింది.
ఈ వివాదంలో కేంద్రంగా నిలిచిన మహిళ ఆలిస్ హువాంగ్. ఆమె చైనా వ్యాపారవేత్త. హువాంగ్ లే అనే పేరుతో కూడా గుర్తింపు ఉంది. జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు సన్నిహిత పరిచయం ఉందన్న వార్తలు బయటకు రావడంతో పాటు, ఆమె చైనా నిఘా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
ఇది కేవలం వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన వివాదం కాదని అమెరికా అధికారుల అనుమానాలు సూచిస్తున్నాయి. ఒకవైపు ఎన్విడియా చిప్స్ చైనాకు చేరుతున్నాయన్న పరిశీలన.. మరోవైపు కంపెనీ అధినేతతో సన్నిహిత సంబంధాల ఆరోపణలు.. ఈ రెండూ కలవడంతో వ్యవహారం మరింత తీవ్రమైంది.
చైనా నుంచి చిప్స్ వరకు.. ఆలిస్ హువాంగ్ ప్రయాణం
ఆలిస్ హువాంగ్ నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఆమె కెరీర్ చైనా ఆర్థిక రంగంలో ప్రారంభమైంది. షాంఘైలోని పెట్టుబడుల సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. HSBC ప్రైవేట్ బ్యాంక్, CITIC సెక్యూరిటీస్‌లో పనిచేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ అనే క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలో కీలక స్థానానికి చేరుకున్నారు. 2023 మార్చిలో ఆ సంస్థలో వాటాదారుగా మారినట్లు కంపెనీ రికార్డులు చెబుతున్నాయి.
మెగాస్పీడ్‌కు ఎన్విడియాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఎన్విడియా అధికారిక క్లౌడ్ పార్ట్‌నర్‌ల జాబితాలో కూడా ఈ సంస్థ పేరు ఉంది. అంటే ఎన్విడియా తయారు చేసే చిప్స్, వాటితో పనిచేసే కంప్యూటింగ్ సేవల రంగంలో మెగాస్పీడ్‌కు కీలకమైన వ్యాపార సంబంధం ఉంది.
ఇక్కడే అమెరికా అధికారుల అనుమానాలు మొదలయ్యాయి. మెగాస్పీడ్ సంస్థ చైనా కంపెనీలకు అమెరికా ఎగుమతి ఆంక్షల పరిధిలో ఉన్న అధునాతన ఏఐ చిప్స్ అందించడంలో సహకరించిందా? వేరే దేశాల ద్వారా చైనాకు చిప్స్ చేరాయా? అనే అంశాలపై పరిశీలన మొదలైంది.
7.5 బిలియన్ డాలర్ల చిప్స్.. కొత్త ఆరోపణలు
ఆలిస్ హువాంగ్‌కు సంబంధించిన వ్యాపార సంబంధాల ద్వారా చైనాకు కనీసం 7.5 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్స్ చేరినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆలిస్ హువాంగ్ తన భర్త, సోదరితో కలిసి చైనా, సింగపూర్‌లలో పలు కంపెనీలతో కూడిన వ్యాపార నెట్‌వర్క్‌ను నిర్మించారు. ఎన్విడియా చిప్స్ కొనుగోళ్లకు ఈ నెట్‌వర్క్ ఉపయోగపడిందనేది ప్రధాన ఆరోపణ.
అమెరికా ఎగుమతి ఆంక్షల కారణంగా కొన్ని చిప్స్ ఆర్డర్లు నిలిచిపోయినప్పుడు, ఎన్విడియాతో ఉన్న పరిచయాలు, పంపిణీదారులతో సంబంధాలను ఉపయోగించి ఇంపోర్ట్ చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 2.4 లక్షల H100, H200, కొన్ని A100 చిప్స్ చైనాకు చేరినట్లు కూడా తెలుస్తోంది. వాటిలో కొన్ని అలీబాబా, టెన్సెంట్ వంటి సంస్థలకు, ఇతర చైనా ఏఐ ల్యాబ్‌లకు చేరాయని అమెరికా ఆరోపిస్తోంది.
జెన్సన్ హువాంగ్‌కు ఆమె ఎలా దగ్గరయ్యారు?
ఈ చిప్స్ వ్యవహారంతో పాటు జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్‌కు ఉన్న పరిచయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇద్దరూ బంధువులు కాదు. 2024లో జరిగిన ఒక టెక్నాలజీ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి కనిపించారు. అమెరికా నిఘా వర్గాలు ఆలిస్ హువాంగ్‌ను చైనా ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన వ్యక్తిగా అనుమానిస్తున్నాయి. జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు ఉన్న పరిచయాన్ని ఉపయోగించి ఎన్విడియా వ్యాపారానికి సంబంధించిన సమాచారం సేకరించారా? కంపెనీ చిప్స్ సరఫరాపై ప్రభావం చూపే ప్రయత్నం జరిగిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అగ్రరాజ్యంలో వణుకు పుట్టిస్తున్నాయి.
ఎన్విడియా విచారణ.. అమెరికా రాజకీయాల్లోనూ ప్రకంపనలు
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు నవంబర్ 8న విచారణకు ఆదేశించింది. విదేశీ నిఘా ఆపరేషన్‌కు జెన్సన్ హువాంగ్ టార్గెట్ గా మారారా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇండిపెండెంట్ డైరెక్టర్ల కమిటీ, న్యాయ నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లేదా ఎన్విడియా వ్యాపార రహస్యాలు బయటకు వెళ్లాయని నమ్మడానికి తమ వద్ద ఆధారాలు లేవని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు జెన్సన్ హువాంగ్ కూడా విచారణకు సహకరిస్తానని తెలిపారు.
ఇక జెన్సన్ హువాంగ్ తన వ్యక్తిగత జీవితంపై ఉద్యోగులకు పంపిన మెసేజ్ లో భార్యకు నమ్మకద్రోహం చేశానని అంగీకరించారు. అయితే ఆలిస్ హువాంగ్ పేరును ఆయన ఆ మెసేజ్ లో ప్రస్తావించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, జెన్సన్ హువాంగ్ తనకు ఈ మహిళ స్పై అని తెలియదని చెప్పినట్లు వెల్లడించారు. ఎఫ్‌బీఐ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపారు.
ఈ వివాదం కంపెనీ మార్కెట్ విలువపైనా ప్రభావం చూపింది. రెండు ట్రేడింగ్ సెషన్లలో ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 430 బిలియన్ డాలర్లు తగ్గింది. వివాదం బయటకు వచ్చినప్పటి నుంచి కంపెనీ షేర్లు 9.5 శాతం పడిపోయాయి. మరోవైపు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారంటూ ఎన్విడియా, జెన్సన్ హువాంగ్‌పై వాటాదారుల తరఫున దావా కూడా దాఖలైంది.
కార్పొరేట్ ప్రపంచంలో స్పై వలలు.. కొత్త ముప్పు ఇదేనా?
ఈ మొత్తం వ్యవహారం ఒక కీలకమైన ప్రశ్నను ముందుకు తెస్తోంది. ఒక కంపెనీ రహస్యాలను తెలుసుకోవడానికి సైబర్ దాడులే మార్గమా? లేక కంపెనీ అధినేతలకు దగ్గరవడం, వ్యక్తిగత పరిచయాలను పెంచుకోవడం ద్వారా కూడా సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు జరుగుతాయా?
అంతర్జాతీయ నిఘా వ్యవస్థల్లో మనుషుల ద్వారా సమాచారాన్ని సేకరించే పద్ధతిని 'హ్యూమన్ ఇంటెలిజెన్స్' అంటారు. ఇందులో పరిచయాలు, స్నేహం, వ్యాపార సంబంధాలు, వ్యక్తిగత అనుబంధాలు కూడా సమాచార సేకరణకు మార్గాలుగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రేమను, నమ్మకాన్ని ఉపయోగించే వ్యూహాలను 'హనీట్రాప్' అంటారు.
ఇలాంటి వ్యూహాల్లో మహిళలే కాదు, పురుషులు కూడా భాగం కావచ్చు. టార్గెట్ గా ఎంచుకున్న వ్యక్తికి ఉన్న అధికారం, పరిచయాలు, సమాచారం ఎంత విలువైనవన్నదే కీలకం. అందుకే కార్పొరేట్ కంపెనీలకు సైబర్ భద్రతతో పాటు ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు, వ్యక్తిగత పరిచయాల విషయంలోనూ అప్రమత్తత అవసరం.
ఎన్విడియా వివాదంలో అసలు నిజాలు విచారణ తర్వాతే స్పష్టమవుతాయి. కానీ ఈ ఘటన ఒక విషయాన్ని మాత్రం గుర్తు చేస్తోంది. నేటి ప్రపంచంలో చిప్స్ కేవలం వ్యాపార ఉత్పత్తులు కావు. అవి దేశాల ఆర్థిక, సాంకేతిక, రక్షణ సామర్థ్యాలను ప్రభావితం చేసే కీలక వనరులు. అలాంటి చిప్స్ చుట్టూ ఒక వ్యక్తిగత పరిచయం కూడా అంతర్జాతీయ భద్రతా చర్చగా మారే పరిస్థితి వచ్చింది. కంపెనీల రహస్యాల కోసం ఇప్పుడు పోటీ చిప్స్ తయారీలోనే కాదు.. ఆ చిప్స్ వెనుక ఉన్న మనుషుల దగ్గరకు చేరుకోవడంలోనూ మొదలైందా? ఇదే ఎన్విడియా వివాదం మిగిల్చిన అతిపెద్ద ప్రశ్న. మొత్తానికి ఈ వివాదం కార్పొరేట్ వరల్డ్ లో తీవ్ర ప్రకంపనలే సృష్టిస్తోంది.


