తెలంగాణ

నాపై కుట్ర జరుగుతోంది- డీజీపీకి వీసీ జానయ్య సంచలన లేఖ

4 నిమిషాల పఠనం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

Aldas Janaiah: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జానయ్య తనను లైంగికంగా వేధించాడని అసిస్టెంట్ ప్రొఫెసర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై వీసీ జానయ్య స్పందించారు. డీజీపీ సీవీ ఆనంద్ కు లేఖ రాశారు. తనపై మహిళా ఫ్యాకల్టీ చేసిన ఆరోపణల వెనకున్న కుట్ర కోణాన్ని వెలికితీసి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు వీసీ జానయ్య. ఈ ఆరోపణల వెనుకున్న నిజానిజాలను నిగ్గుతేల్చాలన్నారు.

వాట్సాప్ చాట్‌లు, కాల్ హిస్టరీ చెక్ చేయాలి

మహిళా ప్రొఫెసర్ ఫోన్ లోని వాట్సాప్ చాట్‌లు, కాల్ హిస్టరీ వంటి ఆధారాలను పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని లేఖలో పేర్కొన్నారు జానయ్య. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. విశ్వవిద్యాలయ బదిలీల విధానంలో భాగంగా 2026 సెప్టెంబర్ 11న మహిళా ఫ్యాకల్టీని నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి బదిలీ చేసినట్లు వివరించారు.

బదిలీ చేశానన్న కోపంతోనే..

బదిలీ చేశానన్న కోపంతోనే సదరు మహిళా ప్రొఫెసర్ తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని జానయ్య ఆరోపించారు. మీడియా ముందుకు వచ్చి తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని లేఖలో పేర్కొన్నారు. జనవరి నుంచి జూన్ మధ్య వేధింపులు జరిగినట్లు చెబుతున్న ఫ్యాకల్టీ.. నవంబర్ 7న ప్రెస్‌మీట్ నిర్వహించి ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తారు.

నా పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే కుట్ర

''నా పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. రెండేళ్లుగా విశ్వవిద్యాలయంలో నేను అమలు చేసిన అనేక ప్రగతిశీల వ్యవస్థలను, మార్పులను అస్థిరపరిచేందుకు ఇదొక పెద్ద కుట్రగా అనిపిస్తోంది. నన్ను వ్యక్తిగతంగా తీవ్రంగా దెబ్బతీయడమే ఆ మహిళా ప్రొఫెసర్ ప్రధాన ప్రయత్నం. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను సమాజంలో దిగజార్చే దురుద్దేశంతోనే లైంగిక వేధింపులు అంటూ నిరాధార ఆరోపణలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు'' అని వీసీ జానయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

#Aldas Janaiah#PJTAU#Vice Chancellor#Professor Jayashankar Telangana Agricultural University#Swechaa News#Harassment
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి