తెలంగాణ

డ్యూటీకి రాకుండానే సంతకాలు.. హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలో బయటపడ్డ డాక్టర్ల బాగోతం

7 నిమిషాల పఠనం

మాజీమంత్రి హరీశ్ రావు సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. డాక్టర్ల బాగోతం బయటపడింది.

Harish Rao: మాజీమంత్రి హరీశ్ రావు సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. డాక్టర్ల బాగోతం బయటపడింది. డ్యూటీ రిజిస్ట్రర్ లో సంతకాలు చేసిన డాక్టర్లు.. డ్యూటీలో మాత్రం లేరు. దీంతో వైద్యుల విధుల నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ రిజిస్టర్ లో సంతకాలు ఉన్నప్పటికీ పలువురు ఎమర్జెన్సీ విభాగాల డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. 318 మంది డాక్టర్లు ఉన్న చోట 301 మందే ఇన్-పేషెంట్లా? అని విస్తుపోయారు. మధ్యాహ్నం 2:30 గంటలకే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, మెడిసిన్, రేడియాలజీ, కంటి విభాగాల్లో ఒక్క డాక్టరూ లేకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోగులకు వైద్యం ఎలా అందుతుంది?

అబ్బయ్య అనే డాక్టర్ మరీ ఘోరం. బుధవారం కూడా డ్యూటీకి వచ్చినట్లుగా ముందుగానే సంతకం పెట్టడాన్ని గుర్తించి హరీశ్ రావు షాక్ అయ్యారు. దీనిపై ఆయన ప్రశ్నించారు. డ్యూటీ సమయంలో ఆసుపత్రిలో ఎందుకు లేరంటూ వైద్యులతో ఫోన్ లో మాట్లాడారు. ఎమర్జెన్సీ వైద్యులే అందుబాటులో లేకపోతే ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. డాక్టర్ అబ్బయ్య వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు హరీశ్ రావు.

సంతకాలు పెట్టి ఆసుపత్రిలో లేకపోవడం దురదృష్టకరం

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు హరీశ్ రావు. నేరుగా ఆర్ఎంఓ రూమ్‌కు వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. చాలామంది డాక్టర్లు డ్యూటీ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి ఆసుపత్రిలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. అక్కడే కూర్చుని ఆయా విభాగాల డాక్టర్లకు స్వయంగా ఫోన్లు చేసి ఎక్కడున్నారని ప్రశ్నించారు. అనంతరం మెటర్నిటీ వార్డు, ఆర్థోపెడిక్ వార్డు, పీడియాట్రిక్ వార్డు, ఫార్మసీ విభాగాలను తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆసుపత్రి డాక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కీలక విభాగాల్లో కనిపించని డాక్టర్లు

''ప్రతిరోజూ 1,000 నుంచి 1,500 ఓపీ అందించే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి అనుసంధానమై 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో నడుస్తోంది. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ డాక్టర్లు అందుబాటులో ఉండాలి. కానీ మధ్యాహ్నం 2-2.30 గంటల సమయంలో ఆసుపత్రికి వస్తే.. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, ఆప్తమాలజీ (కంటి విభాగం), డెంటల్ సర్జరీ వంటి కీలక విభాగాల్లో ఒక్కరంటే ఒక్క ప్రొఫెసర్ గానీ, సీనియర్ డాక్టర్ గానీ డ్యూటీలో లేరు. పీడియాట్రిక్స్‌లో ఒక్కరే ఉన్నారు. గైనకాలజిస్టులు అందుబాటులో లేరు. కేవలం అసిస్టెంట్లు, పీజీ డాక్టర్ల మీదనే ఆసుపత్రిని వదిలేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా ఆసుపత్రిలో ఉండాలి. కానీ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి ఇంటికి వెళ్లిపోవడం అత్యంత దురదృష్టకరం. డాక్టర్ల బాధ్యతారాహిత్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య పడిపోయింది.

318 మంది డాక్టర్లున్న చోట 301 మందే ఇన్-పేషెంట్లా?

ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని కేసీఆర్ హయాంలో సిద్దిపేటకు మెడికల్ కాలేజీ తెచ్చి 600 బెడ్లు ఏర్పాటు చేశాం. ఇవాళ ఆసుపత్రిలో 230 మంది రెగ్యులర్ డాక్టర్లు, 88 మంది పీజీ డాక్టర్లు.. కలిపి మొత్తం 318 మంది డాక్టర్లు ఉంటే, 600 బెడ్లకు గాను కేవలం 301 మంది ఇన్‌పేషెంట్లు మాత్రమే ఉన్నారు. అంటే డాక్టర్ల కంటే పేషెంట్ల సంఖ్యే తక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందక పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా చితికిపోతున్నారు.

ఇకపై ప్రతి నెల రివ్యూ

సమీక్షా సమావేశంలో డాక్టర్లందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఏ విభాగంలోనైనా సరే పేషెంట్ వచ్చిన 24 గంటల్లోపే సర్జరీ జరగాలి. 3-4 రోజులు తిప్పుకోవద్దు. డాక్టర్లందరూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సమయపాలన పాటించాలి. ఇకపై ప్రతి నెలా నేనే స్వయంగా ఆసుపత్రి పనితీరుపై రివ్యూ చేస్తాను. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాల్సిందే'' అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

#Harish Rao#Siddipet#Siddipet Govt Hospital#Doctors#Duty#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి