* సైబరాబాద్‌లో నూతన భరోసా కేంద్రం ప్రారంభం
* మహిళలకు వైద్య, న్యాయ, మానసిక కౌన్సెలింగ్ సేవలు ఒకే చోట అందుబాటులోకి-డీజీపీ సీవీ ఆనంద్
* సైబరాబాద్ మూవ్స్' పేరిట ప్రత్యేక సమావేశాలు
* ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వినూత్న చర్యలు
Bharosa Centre: మహిళలు, బాలికల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో సైబరాబాద్‌లో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రం పూర్తి కావడానికి ఏడేళ్ల సమయం పట్టిందని, ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత కేంద్రం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు డీజీపీ సీవీ ఆనంద్. లైంగిక దాడులు, ఇతర నేరాల్లో బాధితులకు వైద్య పరీక్షలు, మానసిక కౌన్సెలింగ్, న్యాయపరమైన సహాయం, అవసరమైన సంప్రదింపులను ఒకే వేదికపై అందించడం భరోసా కేంద్రాల ప్రత్యేకత అని వివరించారు.
బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయం ఒకేచోట
దేశంలోనే ప్రత్యేకమైన విధానంలో భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయని డీజీపీ తెలిపారు. సుమారు పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా బాధిత మహిళలకు కేవలం పోలీసు సాయమే కాకుండా, వారు ఎదుర్కొన్న మానసిక వేదన నుంచి కోలుకునేందుకు అవసరమైన కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షలతో పాటు బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని ఒకేచోట అందించడం వల్ల కేసుల దర్యాప్తు, న్యాయ ప్రక్రియ మరింత సమర్థంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ప్రత్యేక పోక్సో కోర్టు ఏర్పాటు కూడా నేరస్తులకు శిక్షలు పడే రేటు పెరగడానికి దోహదపడుతోందన్నారు.
మహిళల భద్రతలో SSC కీలక పాత్ర
సైబరాబాద్ పరిధిలో మహిళల భద్రత కోసం SCSC (సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్) అందిస్తున్న సహకారాన్ని డీజీపీ అభినందించారు. రహేజా డైరెక్టర్ శ్రావణ్ భరోసా కేంద్రం నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు. గతంలోనూ మహిళల భద్రతకు సంబంధించిన పలు కార్యక్రమాలకు ఎస్సీ ఎస్సీ మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు.
2013 మేలో చోటు చేసుకున్న రెండు అత్యాచార ఘటనలను ప్రస్తావిస్తూ.. అప్పట్లో చిన్న ఆధారంతోనే కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఘటనల్లో ఒకటి అభయ కేసు. మహిళల భద్రతకు సంబంధించి ఐటీ సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని డీజీపీ ఆనంద్ పిలుపునిచ్చారు.
ట్రాఫిక్ సమస్యకు వినూత్న పరిష్కారాలు
సైబరాబాద్‌లో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోందని డీజీపీ అన్నారు. ముఖ్యంగా ఐటీ సంస్థలు, ఆసుపత్రులు ఉన్న ప్రాంతాల్లో రద్దీ సమయాల్లో వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు కనుగొనే ఉద్దేశంతో నవంబర్ 26-28 తేదీల్లో మూడు రోజులపాటు 'సైబరాబాద్ మూవ్స్' పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఐటీ కంపెనీలు, ఆసుపత్రులు, కార్పొరేట్ సంస్థలు, బస్ రవాణా నిర్వాహకులు, SCSC ప్రతినిధుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్ పూలింగ్, ప్రజా రవాణా వినియోగం, ఉద్యోగుల ప్రయాణ సమయాల నిర్వహణ వంటి అంశాలపై వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్రయోగాలు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని, ఐటీ రంగం నుంచి వచ్చే ఆచరణాత్మక ప్రతిపాదనలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు
కొత్త విధానాలను అమలు చేసే ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, వాటి ఫలితాలు భవిష్యత్తులో మెరుగ్గా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. పోలీసు పాఠశాల అభివృద్ధికి కూడా కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకరించాలని కోరారు.
షీ టీమ్స్ నుంచి టీ సేఫ్ వరకు ఎన్నో సేవలు-సైబరాబాద్ సీపీ రమేష్
2013-16 వరకు అప్పటి సీపీగా పని చేసిన డీజీపీ సీవీ ఆనంద్ వేసిన పునాదులు నేడు సమర్థవంతమైన వ్యవస్థలుగా రూపుదిద్దుకున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ అన్నారు. మహిళల భద్రత కోసం ప్రారంభించిన షీ టీమ్స్, షీ షటిల్స్ సేవలు, సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఉమెన్ పెట్రోల్ వాహనాలు, టీ సేఫ్ యాప్ ఆపద సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో దేశంలోనే మొదటి స్థానం
పాస్‌పోర్టు సేవల్లోనూ సైబరాబాద్ కమిషనరేట్ దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పారు. గతంలో పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియకు 57 రోజులు పట్టేదని, సీవీ ఆనంద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో 'వేరి ఫాస్ట్' కార్యక్రమం ద్వారా ఆ వ్యవధిని కేవలం 8 రోజులకు తగ్గించారని గుర్తుచేశారు. ఈ విధానం రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్‌కు అగ్రస్థానాన్ని తెచ్చిపెట్టిందని, గత 14 ఏళ్లుగా పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగడం అభినందనీయమని అన్నారు. ఈ ఘనతకు సీవీ ఆనంద్ కృషి కూడా కారణమన్నారు సీపీ రమేశ్.
పోలీసు సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీ-స్పార్క్ వంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సీసీటీఎన్ఎస్, ఈ సాక్ష, ఐసీజేఎస్ వంటి సాంకేతిక వ్యవస్థల వినియోగంతో కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని, కన్విక్షన్ రేటు గతంలో 22 శాతంగా ఉండగా ప్రస్తుతం 42 శాతానికి పెరిగిందని వివరించారు.
ప్రజలకు పోలీసు సేవలు అభినందనీయం
ఐటీ రంగంతోపాటు సేవా రంగానికి చెందిన సంస్థలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. కరోనా సమయంలో ఐటీ సంస్థలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. పోలీసు శాఖ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, పోలీసుల పట్ల ప్రజల్లో సానుకూల ధృక్పథం పెరుగుతోందన్నారు. అన్ని వ్యవస్థలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
తమ ప్రాంతంలో ప్రధాన సమస్య ట్రాఫిక్ మాత్రమేనని, ఎండను సైతం లెక్కచేయకుండా ట్రాఫిక్ నియంత్రిస్తున్న పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ ప్రాంతంలో భరోసా కేంద్రం ఏర్పాటు కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.


