తెలంగాణ

తమ్మిడికుంట చెరువుకు జీవం.. మాదాపూర్‌కు కొత్త కళ!

12 నిమిషాల పఠనం

మళ్లీ జలకళను సంతరించుకున్న తమ్మిడికుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హైడ్రా చర్యల వల్ల ఈ చెరువుకు మహర్దశ వచ్చింది.

ఆక్రమణల చెర నుంచి ఆహ్లాదకరమైన జలవనరుగా తమ్మిడికుంట..

హైడ్రా చర్యలతో మారిన రూపురేఖలు..

35 వేల ట్రక్కుల వ్యర్థాల తొలగింపు..

నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం..

ముఖ్య అతిథిగా సినీనటుడు నాగార్జున

హైదరాబాద్‌లోని మాదాపూర్.. ఒకవైపు ఐటీ కంపెనీలు, మరోవైపు ఆకాశహర్మ్యాలు, నిత్యం రద్దీగా ఉండే రహదారులు. అభివృద్ధికి చిరునామాగా మారిన ఈ ప్రాంతంలో ఒకప్పుటి ఓ చెరువు మాత్రం తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ఆక్రమణలు, చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలతో కళావిహీనంగా మారింది. కానీ ఇప్పుడు అదే చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చుట్టూ పచ్చదనం, స్వచ్ఛమైన నీరు, వాకింగ్ ట్రాక్స్, ఫౌంటైన్లు, పిల్లల ఆటస్థలాలు.. ఇలా సరికొత్త అందాలను సంతరించుకుంది. అదే తమ్మిడికుంట చెరువు.

ఒకప్పుడు ఆక్రమణలతో కుంచించుకుపోయిన ఈ చెరువుకు ఇప్పుడు కొత్త జీవం వచ్చింది. దీనికి ప్రధాన కారణం హైడ్రా చేపట్టిన చర్యలే. చెరువు ఆక్రమణలను తొలగించడం దగ్గర నుంచి వ్యర్థాలను బయటకు తీయడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, పరిసరాలను సుందరీకరించడం వరకు సమగ్రంగా పనులు చేపట్టింది. అలా మళ్లీ జలకళను సంతరించుకున్న తమ్మిడికుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

12 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువు.. ఇప్పుడు 30 ఎకరాలకు పైగా విస్తరణ

ఒకప్పుడు తమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 30 ఎకరాలకు పైగా ఉండేది. కానీ కాలక్రమంలో ఆక్రమణలు పెరిగిపోవడంతో చెరువు విస్తీర్ణం సుమారు 12 ఎకరాలకు పడిపోయింది. చెరువు పరిధిలో నిర్మాణాలు వెలిశాయి. చెత్త, ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. వర్షం వస్తే నీరు నిలిచిపోయే పరిస్థితులు కూడా ఎదురయ్యేవి.

ఈ పరిస్థితుల్లో హైడ్రా రంగంలోకి దిగింది. చెరువు పరిధిలోని ఆక్రమణలను తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 2024 ఆగస్టులో తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఎన్ కన్వెన్షన్ నిర్మాణాల కూల్చివేత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చర్యతో చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే హైడ్రా లక్ష్యం ఆక్రమణలను తొలగించడంతోనే ముగియలేదు. తిరిగి చెరువుకు పూర్వ వైభవం తీసుకురావడంపై దృష్టి పెట్టింది.

ఫలితంగా ఇప్పుడు చెరువు విస్తీర్ణం సుమారు 30 నుంచి 30.5 ఎకరాలకు చేరింది. పునరుద్ధరణకు ముందు 12.50 ఎకరాలుగా ఉన్న చెరువు ఎఫ్‌టీఎల్ విస్తీర్ణం ఇప్పుడు 30 ఎకరాలకు చేరింది. అంటే ఆక్రమణల నుంచి విముక్తి కల్పించి, కోల్పోయిన జలవనరును తిరిగి ప్రజల ముందుకు తీసుకొచ్చింది హైడ్రా.

35 వేల ట్రక్కుల వ్యర్థాలు.. బయటకు తీస్తే కానీ కనిపించని అసలు సమస్య!

తమ్మిడికుంట పునరుద్ధరణలో మరో పెద్ద సవాల్ చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు. సాధారణంగా చెరువు అభివృద్ధి అంటే కట్టలు నిర్మించడం, పరిసరాలను అందంగా తీర్చిదిద్దడం మాత్రమే అనుకుంటాం. కానీ ఇక్కడ అసలు సమస్య చెరువు లోపలే ఉంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త, నిర్మాణ వ్యర్థాలు, ఇతర కాలుష్య పదార్థాలను తొలగించడం పెద్ద సవాల్ గా మారింది.

ఏకంగా 35 వేల ట్రక్కుల వ్యర్థాలను బయటకు తీశారు. ఇందులో 5 వేల ట్రక్కుల బయోమెడికల్ వ్యర్థాలు, మరో 30 వేల ట్రక్కుల ఇతర పేరుకుపోయిన వ్యర్థాలు ఉన్నాయి. ఈ స్థాయిలో వ్యర్థాలను తొలగించడం ద్వారా చెరువు స్వరూపమే మారిపోయింది.

అంతేకాదు.. చెరువు లోతును కూడా భారీగా పెంచారు. గతంలో కేవలం 0.6 మీటర్ల లోతు మాత్రమే ఉండగా, ఇప్పుడు 4.6 మీటర్లకు పెంచారు. నీటి విస్తీర్ణం కూడా గతంలో 10 ఎకరాల నుంచి ఇప్పుడు 26 ఎకరాలకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో వర్షాకాలంలో వచ్చే నీటిని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది. 46 మిలియన్ లీటర్ల నుంచి 375 మిలియన్ లీటర్లకు సామర్థ్యం పెరిగింది.

5 కొత్త ఇన్‌లెట్లు.. వరద ముప్పు తగ్గించేందుకు చర్యలు

చెరువు పునరుద్ధరణలో నీటి నిల్వ సామర్థ్యం ఎంత ముఖ్యమో, అందులోకి నీరు చేరే మార్గాలు కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ్మిడికుంటకు ఐదు కొత్త ఇన్‌లెట్లను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు చెరువులోకి చేరేందుకు వీటిని అభివృద్ధి చేశారు.

ఈ చెరువు క్యాచ్‌మెంట్ ప్రాంతం 1.62 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ప్రధాన కట్ట పొడవు 248 మీటర్లు కాగా, రింగ్ బండ్ పొడవు 2,263 మీటర్లు. నీటి విస్తీర్ణం పెరగడం, నీటి ప్రవాహ మార్గాలను మెరుగుపరచడం వల్ల భారీ వర్షాల సమయంలో నీటిని ఒడిసిపట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.

గతంలో శిల్పారామం-హైటెక్ సిటీ కారిడార్‌లో వర్షం పడితే రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. కానీ తమ్మిడికుంట పునరుద్ధరణతో ఈ ప్రాంతంలో వరద ముప్పును తగ్గించేందుకు మరో కీలకమైన జలవనరు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ ఈ ప్రాంతంలో రహదారిపై నీరు నిలిచిపోలేదు.

వాకింగ్ ట్రాక్‌లు.. ఓపెన్ జిమ్.. పిల్లలకు ప్రత్యేక ఆటస్థలం

తమ్మిడికుంటను కేవలం చెరువుగా పునరుద్ధరించలేదు. ప్రజలు కుటుంబాలతో వచ్చి కొంత సమయం గడిపేలా, ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా అభివృద్ధి చేశారు. చెరువు చుట్టూ సుమారు 1.5 కిలోమీటర్ల మేర వాకింగ్, జాగింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్లేవారికి ఇది మంచి ప్రదేశంగా మారనుంది.

వ్యాయామం కోసం ఓపెన్ జిమ్, యోగా కోసం ప్రత్యేక వేదికలు, పిల్లల కోసం ప్లే ఏరియా, కుటుంబ సభ్యులు కూర్చుని సేదతీరేందుకు గెజిబోలు, సీటింగ్ ఏర్పాట్లు చేశారు. పచ్చదనాన్ని పెంచేందుకు గ్రీన్ బఫర్స్, మొక్కలు, ల్యాండ్‌స్కేపింగ్‌తో పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రాత్రివేళల్లోనూ ప్రజలు సురక్షితంగా తిరిగేందుకు లైటింగ్ ఏర్పాట్లు చేశారు.

చెరువు మధ్యలో ఫౌంటైన్లు, పచ్చదనంతో కూడిన ప్రత్యేక ప్రాంతాలు, పూల తోటలు ఈ ప్రదేశానికి మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. అంటే మాదాపూర్‌లో నివసించే వారికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా ఇది మంచి విశ్రాంతి కేంద్రంగా మారనుంది.

తమ్మిడికుంట ఒక్కటే కాదు.. నగరవ్యాప్తంగా హైడ్రా చర్యలు

తమ్మిడికుంట పునరుద్ధరణను చూస్తే హైదరాబాద్‌లో జలవనరులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఎంత అవసరమో అర్థమవుతుంది. హైడ్రా ఇప్పటివరకు వివిధ విభాగాలకు చెందిన 3,520 ఎకరాల 39 గుంటల ప్రభుత్వ, ప్రజా ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.1.65 లక్షల కోట్లుగా పేర్కొంది.

ఇందులో 545 ఎకరాల 29 గుంటల చెరువులు, 30 ఎకరాల ఒక గుంట నాలాలు, 2,752 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటితో పాటు 91 ఎకరాల 28 గుంటల పార్కులు, 55 ఎకరాల 33 గుంటల రోడ్లు, ఫుట్‌పాత్‌లు, 45 ఎకరాల 21 గుంటల ప్రజా బహిరంగ స్థలాలను కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది.

చెరువును బతికించుకోవడం మనందరి బాధ్యత

ఒక చెరువును పునరుద్ధరించడం ఎంత ముఖ్యమో, దానిని భవిష్యత్తులో కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే తమ్మిడికుంట పరిసరాల్లో ప్లాస్టిక్, చెత్తాచెదారం వేయవద్దని, నిర్మాణ వ్యర్థాలు, మురుగునీటిని చెరువులోకి వదలవద్దని హైడ్రా ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఆక్రమణలు, అక్రమ వ్యర్థాలు పడేసినట్టు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది.

నగరంలో చెరువులు కేవలం నీటి నిల్వ కేంద్రాలు కావు. అవి భూగర్భ జలాలకు ఆధారం. వరదల సమయంలో రక్షణ కవచాలు. పర్యావరణ సమతుల్యతకు కీలకం. ప్రజల ఆరోగ్యానికి అవసరమైన పచ్చని ప్రదేశాలు.

ఈ నేపథ్యంలో తమ్మిడికుంట పునరుద్ధరణ ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ఆక్రమణలను తొలగిస్తే చెరువులను తిరిగి బతికించవచ్చని, చెత్తకుప్పలుగా మారిన జలవనరులను ప్రజలకు ఉపయోగపడేలా మార్చవచ్చని ఈ ప్రాజెక్టు చాటిచెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్న తమ్మిడికుంట.. మాదాపూర్‌కు కొత్త ఆకర్షణగా నిలవనుంది.

#Thammidikunta Lake#HYDRAA#Hyderabad News#Madhapur Lake#Revanth Reddy#Telangana News#Lake Restoration#Hyderabad Development#HYDRAA Lake Restoration#Telangana Government#Lake Rejuvenation#Hyderabad Lakes#Urban Development#Water Conservation#Hyderabad Infrastructure
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి