రాష్ట్రంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయాల్లో ఆశించిన మేర నీటి నిల్వ లేదు. గతంతో పోలిస్తే ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తెలంగాణలో 17 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం గణనీయంగా పడిపోయింది.సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగుంటుకుపోయాయని తెలుస్తోంది. ఊర్లలో పొలాలకు నీళ్లు అందించేందుకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు రావడం లేదని సమాచారం.
అయితే, ఇటువంటి పరిస్థితుల్లో అటు రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగు నీటి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. వర్షాలు పడిన సమయంలో కాళేశ్వరం వద్ద లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లిపోయి సముద్రంలో కలిసినా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. నీరు ఎత్తిపోయకుండా అలాగే వదిలేసింది. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. సాగుకోసం సర్కారు నీరు విడుదల చేయడం లేదు.
ఈసారి ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పడిపోనుందని తెలుస్తోంది. వరి సాగుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో ధాన్యం దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ నిపుణులు అంచనావేస్తున్నారు.ఎల్ నినో కారణంగా ఎండాకాలంలో ఎలాగైతే భానుడు ప్రభావం చూపుతాడో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎండలు ఇలాగే కొడితే రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో ఉన్న నీరు మొత్తం అడుగంటడం ఖాయంగా తెలుస్తోంది.అప్పుడు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎత్తే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఆయకట్టు రైతుల కోసం కర్ణాటక విడుదల చేస్తామన్న 5 టీఎంసీల నీళ్లు ఇంతవరకు రాలేదు. రేవంత్ సర్కార్ మాత్రం ఈ విషయంలో నోరుమెదపడం లేదు. ఇస్తామని చెప్పి నీళ్లు ఇవ్వడం లేదేంటని మంత్రులు సైతం ప్రశ్నించడం లేదు.
ఇదిలాఉంటే రైతులు, ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీర్ల కంపెనీలకు నిత్యం నీటి సరఫరా చేసేందుకు ఓకే చెప్పింది. కరువు పరిస్థితులు ఉన్నా బీర్ల తయారీ కోసం కంపెనీలకు శ్రీశైలం నుండి నీటిని ఇస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజాగా ప్రకటించారు.బీర్ల ఉత్పత్తికి కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.ఇందుకోసం శ్రీశైలం నుండి నీటిని సాధ్యమైనంత వరకు వాడుకుంటామని చెప్పారు.అయితే, తెలంగాణలో ఎల్‌నినో ఎఫెక్ట్ లిక్కర్ ఉత్పత్తిపై లేదా? అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు సాగు నీరు ఇవ్వకుండా.. బీర్లకు నీటిని సప్లయ్ చేస్తారా? మీకు రైతుల కంటే ఆదాయమే ముఖ్యమా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


