తెలంగాణ

Telangana: దసరా సందర్భంగా TGSRTC బంపరాఫర్-ప్రయాణికుల కోసం అందుబాటులోకి కొత్త సేవలు..

రచన: Venu•••6 నిమిషాల పఠనం

దసరా పండగ వచ్చిందంటే ప్రజా రవాణా వ్యవస్థకు పండగే.. ఆర్టీసీకి ప్రత్యేక పర్వదినాలలో ఉన్నంత ఆదాయం ఇతర రోజుల్లో కనిపించదని చాలా సందర్భాలలో రుజువైంది కూడా

దసరా పండగ వచ్చిందంటే ప్రజా రవాణా వ్యవస్థకు పండగే.. ఆర్టీసీకి ప్రత్యేక పర్వదినాలలో ఉన్నంత ఆదాయం ఇతర రోజుల్లో కనిపించదని చాలా సందర్భాలలో రుజువైంది కూడా.. రాష్ట్రంలో జరిగే కొన్ని జాతర సమయాల్లో.. అలాగే దసరా, సంక్రాంతితో పాటు శివరాత్రి, కార్తీక పౌర్ణమి దీపావళి వేళల్లో రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

ముఖ్యంగా పెద్ద పండగలు అయిన దసరా, సంక్రాంతికి అయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుండి లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అందువల్ల వేలాది సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఈ సమయాల్లో ఆర్టీసీ ఆపరేట్ చేస్తుంది. రికార్డ్ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.

ఈ క్రమంలో అక్టోబర్ నెల 20 వ తారీఖు 2026 లో దసరా పండగ జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్దం అవుతున్నారు. ఇప్పటిని నుండే వారి వారి ఊర్లకు వెళ్ళడానికి టికెట్లు రిజర్వేషన్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక TS RTC కూడా ప్రయాణీకుల కు వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది..

ఇందులో భాగంగా ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే గ్రూపు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటి వద్దకే బస్సు పంపి వారిని పికప్ చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టింది. కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు ఒకే ప్రాంతానికి ప్రయాణించాలనుకునే వారికి ప్రయోజనం కలిగేలా తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బస్టాండ్ వరకు వచ్చి బస్సుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తోంది.

ఇక ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో కుటుంబం సభ్యులతో కలిసి ఊర్లకు వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది. ఒకే ప్రాంతానికి వెళ్లాలనుకునే వారి సంఖ్య 30 మంది వరకు ఉండి.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ముందే కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సు పంపిస్తామని ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణ సౌకర్యం అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియచేశారు..

ఇక ప్రత్యేక బస్సులను బుక్ చేసుకునేందుకు ఆర్టీసీ ఏరియాల వారీగా ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు తమ ప్రాంతానికి సంబంధించిన నంబర్‌ను సంప్రదించి ప్రత్యేక బస్సులను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఏఎస్‌రావునగర్, తార్నాక, ఉప్పల్, రేతిఫైల్ ప్రాంతాల ప్రయాణికులు 99592 26142 నంబర్‌లో సికింద్రాబాద్ డీఆర్‌ఎంను సంప్రదించాలి.

కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బాలానగర్, పటాన్‌చెరు, బీరంగూడ, దుండిగల్ ప్రాంతాలకు చెందిన వారు 99562 26148 నంబర్‌ను సంప్రదించాలని.. అదేవిధంగా దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, బడంగ్‌పేట్, ఆదిభట్ల, మిధాని, సరూర్‌నగర్ ప్రాంతాల ప్రయాణికులు 99892 26136 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.. ఈ నంబర్ల ద్వారా సంప్రదిస్తే ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సుల బుకింగ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. అవసరాన్ని బట్టి ప్రయాణికుల ప్రాంతానికి సమీపం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని వారు వెల్లడించారు.

మరోవైపు ఆర్టీసీ ప్రకటించిన ఈ నిర్ణయంతో ప్రయాణికులకు సమయం, ఆటో, టాక్సీ ఖర్చులు ఆదా అవ్వడమే కాకుండా బస్సు మిస్ అవుతుందనే ఆందోళన ఉండదు. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాలేజీలు, హాస్టళ్ల వద్ద నుంచే నేరుగా ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

#Telangana RTC#Dussehra Special Buses#TelanganaRTC BusBooking#GroupBooking#SpecialBusServices DussehraTravel#HyderabadRTC#HomePickup BusService#TelanganaNews#TravelUpdate#TSRTC Dussehra 2026
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి