National

India - Russia: డాలర్ పెత్తనానికి భారత్ - రష్యా ఉమ్మడి చెక్.. ఢిల్లీ- మాస్కో సరికొత్త గేమ్‌ప్లాన్ ఇదేనా!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత యావత్ ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు అమెరికా, పాశ్చాత్య కూటమి విసిరిన అత్యంత బలమైన అస్త్రం ‘ఆర్థిక ఆంక్షలు’. రష్యాతో ఎవరు వాణిజ్యం సాగించినా తీవ్ర పరిణామాలుంటాయంటూ వాషింగ్టన్ జారీ చేసిన హెచ్చరికల ముందు చాలా దేశాలు మోకరిల్లాయి.

India - Russia: ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత యావత్ ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు అమెరికా, పాశ్చాత్య కూటమి విసిరిన అత్యంత బలమైన అస్త్రం ‘ఆర్థిక ఆంక్షలు’. రష్యాతో ఎవరు వాణిజ్యం సాగించినా తీవ్ర పరిణామాలుంటాయంటూ వాషింగ్టన్ జారీ చేసిన హెచ్చరికల ముందు చాలా దేశాలు మోకరిల్లాయి. కానీ, 140 కోట్ల జనాభా ప్రయోజనాలే పరమావధిగా నిలిచిన భారత్ మాత్రం ఆ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు. "మా జాతీయ ఇంధన భద్రతే మాకు ప్రథమ ప్రాధాన్యం" అని కుండబద్దలు కొట్టిన ఢిల్లీ దౌత్యనీతి.. ఇప్పుడు రష్యాతో బంధాన్ని సరికొత్త వ్యూహాత్మక శిఖరాలకు చేర్చింది. ఇది కేవలం చౌకగా ముడిచమురు కొనడానికే పరిమితమైన బంధం కాదు.. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో డాలర్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతూ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్న సరికొత్త భౌగోళిక రాజకీయ విప్లవం.

డాలర్ కోరలు పీకేసిన 'రూపాయి - రూబుల్' వ్యూహం

అమెరికా ఆంక్షల తుఫాను ప్రపంచ వాణిజ్యాన్ని తాకకుండా ఉండేందుకు భారత్ - రష్యా వేసిన మొదటి అడుగు పేమెంట్ సిస్టమ్ మార్పు. దశాబ్దాలుగా గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న డాలర్ ఆధారిత లావాదేవీలకు స్వస్తి పలికి, రూపాయి - రూబుల్ నేరుగా చెల్లించే స్వతంత్ర యంత్రాంగాన్ని సక్సెస్‌ఫుల్‌గా పట్టాలెక్కించాయి. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 59.86 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో రష్యా నుంచి ముడిచమురు దిగుమతులే ఏకంగా 44.38 బిలియన్ డాలర్లుగా నమోదై, భారతదేశ ఇంధన అవసరాలను నిరంతరాయంగా కాపాడాయి.

భారత యువతకు 70 వేల కొలువులు!

ఈ స్పెషల్ పార్టనర్‌షిప్‌లో అత్యంత ఆసక్తికరమైన మలుపు మానవ వనరుల భాగస్వామ్యం. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అంతర్గత పరిణామాల వల్ల రష్యాలో సాంకేతిక, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత తీవ్రమైంది. ఈ కొరతను అధిగమించడానికి రష్యా పూర్తిగా భారత్‌పైనే భరోసా ఉంచింది. ప్రధానంగా కన్‌స్ట్రక్షన్, సప్లై చైన్, లాజిస్టిక్స్ రంగాల్లో మన దేశం నుంచి ఏకంగా 70 వేల మంది నిపుణులను రిక్రూట్ చేసుకోవడానికి మాస్కో రూట్ క్లియర్ చేసింది. దీనివల్ల భారత నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి లభించడమే కాక, దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం సమకూరనుంది. ఇదే టైంలో రష్యా సైన్యంలో పొరపాటున, మోసపూరితంగా చిక్కుకున్న భారతీయుల భద్రతపై ఢిల్లీ రాజీలేని వైఖరి ప్రదర్శించింది. ఇప్పటికే 140 మందిని సురక్షితంగా రప్పించిన కేంద్రం, మిగిలిన 55 మంది రక్షణ బాధ్యతను అత్యున్నత దౌత్య స్థాయిలో పర్యవేక్షిస్తోంది.

$100 బిలియన్ల దిశగా 'మిషన్ 2030'

ప్రస్తుత వాణిజ్యంలో దిగుమతులు 55.36 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో మన ఎగుమతులు కేవలం 4.49 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండటం ఓ ప్రధాన లోటు. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు భారత్ పక్కా రోడ్‌మ్యాప్‌ను రెడీ చేసింది. ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ప్రాసెస్డ్ ఫుడ్, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ మెషినరీ, రసాయనాలు, టెక్స్‌టైల్స్ అనే 7 కీలక రంగాల ద్వారా రష్యా మార్కెట్‌లోకి భారత ఉత్పత్తులను ముంచెత్తనున్నారు. తద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు, పరస్పర పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 1971 నాటి ఇండో-సోవియట్ చారిత్రక ఒప్పందం నుంచి నేటి ఆధునిక వాణిజ్య ఒప్పందాల వరకు.. కష్టకాలంలో అండగా నిలిచే నమ్మకమైన మిత్రుడిగా నిరూపించుకున్న ఈ ద్వయం, పాశ్చాత్య ఆంక్షల హెచ్చరికలను లెక్క చేయకుండా గ్లోబల్ పాలిటిక్స్‌లో కొత్త పవర్ సెంటర్‌గా దూసుకుపోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#India Russia Relations#India Russia Ties#India Russia Partnership#India Russia Trade#India Russia Strategic Partnership#Rupee Ruble Trade#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి