శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రక్షకభటుల కార్యాలయానికే చెందిన నిధులు పక్కదారి పట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన యూజర్ ఛార్జీల ఖాతా నుంచి దాదాపు రూ. 2.76 కోట్ల ప్రజాధనం పక్క దారి పట్టిందనే వార్తలు పోలీసు వర్గాల్లోనే కాకుండా సామాజిక, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. దారి మళ్లిన నిధులతో హైదరాబాద్ నగరంలోని ఒక ఖరీదైన ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేశారనే ఆరోపణలు ఐపీఎస్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
పథకం ప్రకారమే నిధుల మళ్లింపు జరిగిందా?
గత రెండు నెలల కాలంలో సైబరాబాద్ యూజర్ ఛార్జీల అకౌంట్ నుంచి మహాకాల్ ఎంటర్‌ప్రైజెస్, కేబీ ఎంటర్‌ప్రైజెస్ అనే రెండు ప్రైవేట్ ఏజెన్సీల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని సమాచారం.. ఈ క్రమంలో ఈ రెండు ఏజెన్సీల చిరునామాలను పరిశీలిస్తే కేవలం కొన్ని అంకెలు, అక్షరాల తేడాతో రాజేంద్రనగర్, అత్తాపూర్ ప్రాంతాల్లోని వెంకటేశ్వర ఎన్‌క్లేవ్‌లో ఒకే ప్రాంగణంలో ఉన్నట్లు తేలింది.
మహాకాల్ ఎంటర్‌ప్రైజెస్ (3-3-107/16A, వెంకటేశ్వర ఎన్‌క్లేవ్, రాజేంద్రనగర్ ఫేజ్, హైదరాబాద్-500048) పేరిట ఉండగా, KB ఎంటర్‌ప్రైజెస్ (గ్రౌండ్ ఫ్లోర్ 3-3-107/16 P, వెంకటేశ్వర ఎన్‌క్లేవ్, హైదర్ గూడ, ఫేజ్-2 అత్తాపూర్, హైదరాబాద్-500048) పేరిట నమోదై ఉంది. అయితే ఈ కంపెనీకి ఎలాంటి పని అనుభవం కానీ, అంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు చేపట్టే మౌలిక వసతులు లేకుండా వర్క్ ఆర్డర్లు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే పథకం ప్రకారం ప్రజాధనాన్ని కాజేసేందుకే ఈ సూట్‌కేస్ కంపెనీలను తెరపైకి తెచ్చి నిధులు మళ్లించారని పోలీసు వర్గాలే చర్చించుకుంటున్నాయి.
ఈ స్కామ్ పై లోతైన విచారణకు డిమాండ్
ఈ అనుమానాస్పద లావాదేవీలపై ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.. ఈ కుంభకోణం వెనుక ఉన్న ప్రధాన పాత్రలను బయటకు తీయాలని పలువురు సామాజిక కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ, ఇన్‌కమ్ టాక్స్, సీబీఐ, ఈడీ (ED) లకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఇక పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ లావాదేవీల వెనుక ఉన్న హస్తం ఎవరిది? అర్హత లేని సూట్‌కేస్ కంపెనీలకు నిధులు ఎందుకు మళ్లించాల్సి వచ్చింది? ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఆ ఖరీదైన ఆస్తి ఎవరిది? అనే చర్చలు సాగుతున్నాయి.. నిజాలు నిగ్గు తేల్చి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు వర్గాలే బహిరంగంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వరకు.. మారని తీరు, లోపం ఎక్కడ?
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ప్రజాధనం లూటీ అయ్యే తీరు మారకపోవడం గమనార్హం. గత బీఆర్ఎస్ హయాంలో అయినా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అయినా అక్రమాలు అరికట్టడంలో, వ్యవస్థల్లో పారదర్శకత తెవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆడిటింగ్ వ్యవస్థ వైఫల్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
ప్రభుత్వ శాఖల్లోని ప్రత్యేక అకౌంట్లు, యూజర్ ఛార్జీల ఖాతాలపై క్రమం తప్పకుండా థర్డ్-పార్టీ ఆడిటింగ్ జరగకపోవడమే ఇటువంటి అక్రమాలకు మూలకారణంగా మారుతోందని అంటున్నారు.. అలాగే నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే అంతర్గత విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప, శాఖాపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం అవినీతిపరులకు వరంగా మారుతోంది.
మరోవైపు అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రమాణం చేసే రాజకీయ పార్టీలు.. అధికారంలోకి వచ్చాక వ్యవస్థాగత సంస్కరణలపై దృష్టి పెట్టకపోవడం వల్ల క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అక్రమార్కులు పేట్రేగిపోతున్నారనే ఆరోపణలున్నాయి.. ఇక కోట్ల రూపాయల ప్రజాధనం పోలీసు శాఖలోనే పక్కదారి పడితే, ఇక సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి ప్రజాధనాన్ని రికవరీ చేయడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి..


