ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు.రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఎస్ఈసీ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ పునేఠా ప్రకటించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు వచ్చాక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు నిన్న మీడియాకు వివరాలు వెల్లడించారు. దీంతో తదుపరి ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు అనిల్ చంద్ర స్పష్టంచేశారు.
వైసీపీ అభ్యర్థులను అడ్డుకోవడం వల్లే..
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనియకుండా అడ్డుకుంటోందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. కూటమి నేతలు దాడులకు పాల్పడటంతో పాటు తమ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని.. అందుకే నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలని వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. నామినేషన్ల గడువును రాష్ట్రవ్యాప్తంగా పొడగింపు, వాయిదాకు నిరాకరించింది.
ఎక్కడైతే నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని ఫిర్యాదు చేసిన చోటే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. దీనిపై గురువారంలోపు నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది.దీంతో 100 చోట్ల ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న సాయంత్రం కీలక ప్రకటన చేసింది. మొత్తంగా 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలుత కొన్ని స్థానాల్లో నిలిపివేయాలని భావించగా, ఇప్పుడు అన్ని స్థానాల్లో బ్రేక్ పడింది.ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు -17, మున్సిపాలిటీలు -76, నగర పంచాయతీలు-30 వరకు ఉన్నాయి. మొత్తంగా పట్టణ స్థానిక సంస్థలు
123 ఉండగా.. 100 మేర పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను ఎన్నికల ప్రధాన అధికారి నిలిపివేశారు. మిగతా 23 స్థానాల్లో గతంలోనే న్యాయపరమైన కారణాలతో వాయిదా పడ్డాయి. తాజాగా ఎన్నికలు నిలిచిన జిల్లాల్లో.. కలెక్టర్లు,ఎస్పీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా తదుపరి ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్టు ఎస్ఈసీ ప్రకటించారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో మొత్తం 19 స్థానాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య దాడులు, పెద్దఎత్తున ఆస్తుల ధ్వంసం జరిగింది.పలువురు నేతలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏకగ్రీవాలకు ఎన్నికలు ఉంటాయా?
ఇదిలాఉండగా, ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే టీడీపీ, జనసేన కొన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నట్టు తెలిసింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో..కడప మున్సిపల్ కార్పొరేషన్లో 66 కార్పొరేటర్ స్థానాలకు గాను 63 స్థానాలు టీడీపీకి ఏకగ్రీవంగా గెలుచుకున్నట్టు కథనాలు వచ్చాయి. విజయవాడలోనూ జనసేన కొన్ని స్తానాలను ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ స్థానాలకు కూడా తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది ఎన్నికల సంఘం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. తిరిగి ఎన్నికలు జరిగితే కూటమి సర్కారుకు నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది.


