ఈ కోణంలో ఎందుకు చూడరు?
దసరా వేళ రూ.555 కోట్ల విలువైన మద్యం విక్రయాలు..
గతేడాదితో పోలిస్తే అధికమే.. అయితే ఏంటి?
మా సంస్కృతి, సంప్రదాయాలను గుర్తించండి..
మద్యం వినియోగం కోణంలోనే తెలంగాణను చూడొద్దు
తెలంగాణను ‘తాగుబోతుల రాష్ట్రం’గా చిత్రీకరించొద్దు
మద్యం లెక్కలతో తెలంగాణ సంస్కృతిని కలపొద్దు!
కల్చర్‌లో కలుపుగోలుతనం.. కేవలం తాగుడే కాదు!
మా సంస్కృతిని కించపరచొద్దు.. మా ఆత్మీయతను చూడండి!
తెలంగాణ పండుగల వెనుక ఓ ప్రత్యేక సంస్కృతి!
ఆంధ్రా మీడియా ఇప్పటికైనా కళ్లు తెరవాలి..
అపోహలు వద్దు: తెలంగాణ ప్రజల విజ్ఞప్తి
గతేడాది కంటే తెలంగాణలో సుమారు రూ.555 కోట్ల విలువైన మద్యం వినియోగం పెరిగిపోయిందని దసరా పండుగ వేళ టీవీ ఛానళ్లు, వివిధ పత్రికల్లో ప్రచారాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రా మీడియా ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు పెద్ద తాగుబోతులుగా చూపిస్తూ ఈ ప్రచారానికి మరింత ఊతం పోస్తోంది. ఇక్కడ ఆంధ్రా మీడియా ఒకే కోణంలో ప్రచారం చేయడం సరికాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ సంప్రదాయాలు, సంస్కృతిని తెలుసుకోవాలి.
తెలంగాణ జీవన విధానంలో భాగమే.. నేర ప్రవృత్తికి దారితీయదు..
ఎక్కడా ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకపోవడమే తెలంగాణ సంస్కృతికి ప్రత్యక్ష నిదర్శనం. మిగతా ప్రాంతాల్లో అన్ని పండుగలకు వైన్ షాపులు మూసేసినా, దసరా నాడు తెరచి ఉంచడం ఇక్కడి ఆచారం. మద్యం అనేది తెలంగాణ జీవన విధానంలో, ఉత్సవాల్లో ఒక భాగమే తప్ప అది నేరప్రవృత్తికి దారితీయదు. చాలా చోట్ల మద్యం తాగి దాడులు చేసుకున్నా, ప్రాణాలు తీసుకున్నా పట్టీపట్టనట్లుండే మీడియా.. తెలంగాణపై మాత్రం నిరంతరం 'తాగుబోతుల రాష్ట్రం' అంటూ తప్పుడు చిత్రీకరణ చేస్తోంది.
కల్మషం లేని మనసులు.. కలుపుగోలు మనుషులు
చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరం ఒకేచోట కూర్చుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే సౌభ్రాతృత్వం ఇక్కడ కనిపిస్తుంది. కల్మషం లేని మాటలతో, కలుపుగోలు తనంతో ఇక్కడి ప్రజలు మెలుగుతారు. గతంలో దసరా పండుగ రోజు తల్వార్‌తో చిన్నపాటి ఘర్షణలు జరిగినా, ఆ తర్వాత గ్రామంలో మళ్లీ కత్తుల నీడ కూడా కనిపించని ప్రశాంత వాతావరణం తెలంగాణ సొంతం. ప్రజల ఆగ్రహం ఎదురైతే అది వ్యవస్థలపైనే తప్ప, వ్యక్తులపై ద్వేషం పెంచుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలకి లేదు. ఇదంతా సంస్కృతిలో భాగమే తప్ప మరేమీ కాదని, ఆంధ్రా మీడియా లేనిపోని అపోహలు సృష్టించడం మానుకోవాల్సిన అవసరం ఉంది.
జాతీయ గణాంకాల్లో తెలంగాణతో పాటు ఏపీ
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలు, ఇతర వివరాల ప్రకారం, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మద్యం వినియోగానికి సంబంధించి కొన్ని స్పష్టమైన పోలికలు, తేడాలు కనిపిస్తున్నాయి. 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళల గణాంకాలను పరిశీలిస్తే, జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మద్యం వినియోగంలో ముందు వరుసలోనే ఉన్నాయి. అయితే ప్రాంతీయ సంస్కృతులు, జీవన శైలి ఆధారంగా ఈ వినియోగ శాతాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటం గమనించవచ్చు.
రాష్ట్రాల పునర్విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ రెండు రాష్ట్రాలలో, విడిపోయిన తర్వాత కూడా మద్యం వినియోగ సరళిలో భిన్నతలు ఉన్నాయి. జాతీయ సగటు (18.9%) పురుషుల వినియోగంతో పోలిస్తే తెలంగాణలో 43.9% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది సుమారు 35.4% నుండి 37% వరకు ఉంది. మరి మీరు కూడా ఏం తీసిపోలేదుగా.
అంతేకాదు.. భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మద్యం వినియోగ సరళిని పరిశీలిస్తే, ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో పురుషులు (52.7%), మహిళలు (24.2%) వినియోగంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత తెలంగాణ (43.9%), సిక్కిం (39.8%) తదితర రాష్ట్రాలు ఉన్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ (35% పైమాటే), ఏపీలోనూ తాగేవాళ్లు ఎక్కువే ఉన్నప్పటికీ, తెలంగాణతో పోలిస్తే కొద్దిగా తక్కువ. ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే, తెలంగాణలో 7.1% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 0.4% నుండి 1% లోపే ఉంది.
గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలే కారణం..
తెలంగాణ రాష్ట్రాలు రెండూ కూడా అధిక వినియోగ జాబితాలోనే ఉన్నప్పటికీ, వీటిని కేవలం ఒకే కోణంలో చూపిస్తూ ప్రాంతీయ దురభిప్రాయాలను సృష్టించడం సరికాదు. తెలంగాణ లాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే మద్యం వినియోగం కొద్దిగా ఎక్కువగా ఉంది. తెలంగాణలోని కొన్ని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల మద్యం వినియోగం కొంత ఎక్కువగా ఉండటానికి స్థానిక సంప్రదాయాలే ప్రధాన కారణం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ బడ్జెట్ ఆదాయంలో ఎక్సైజ్, మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా ఉంటోంది.
విదేశాల్లో 70శాతం కంటే ఎక్కువే..
విదేశాల్లో (Foreign Countries) మద్యం వినియోగం మన దేశంతో పోలిస్తే చాలా ఎక్కువే ఉంటుంది. ఫ్రాన్స్, యూకే, జర్మనీ వంటి దేశాలలో 70శాతం కంటే ఎక్కువ మంది క్రమం తప్పకుండా మద్యం సేవిస్తారు. అయినప్పటికీ వారు ఆరోగ్యంగా, ఫిట్‌గానే ఉంటారు. అక్కడ ఎవరూ రోడ్లపై విపరీతంగా గొడవలు పడకుండా, లిమిటెడ్‌గా మద్యం తీసుకుంటూ తమ రోజువారీ వృత్తిగత పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పరిమిత మద్యంతో జీవిస్తే ఆరోగ్యానికి, సమాజానికి ఎలాంటి నష్టం ఉండదు. జీవనశైలిలోని క్రమశిక్షణ ఉన్నంతవరకు ఎలాంటి సమస్య ఉండదు.
లేనిపోని అపోహలు సృష్టించడం మానుకోవాలి
విదేశాల మాదిరిగానే మన దగ్గర కూడా మద్యం అనేది కేవలం ఒక ఉత్సవ వాతావరణాన్నిచ్చే సంప్రదాయమే అవుతుంది. కేవలం రాజకీయ లేదా ప్రాంతీయ దురుద్దేశాలతో తెలంగాణ సంస్కృతిని 'తాగుబోతుల తెలంగాణ' అంటూ ఆంధ్రా మీడియా తప్పుగా ప్రచారం చేయడం అత్యంత బాధాకరం. తెలంగాణ ప్రజల ఆప్యాయతలను, కల్మషం లేని బంధాలను అర్థం చేసుకోకుండా, నిరాధారమైన అపోహలను సృష్టించడం మానుకోవాలి.


