వ్యాపారం

SBI కస్టమర్లకు అలర్ట్‌.. డార్క్‌ వెబ్‌లో వ్యక్తిగత వివరాలు!

రచన: Kashi••8 నిమిషాల పఠనం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన డేటా లీక్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. డార్క్‌ వెబ్‌లో లభించిన సుమారు 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా, వాటిలో 3,897 రికార్డుల్లో వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం ఉన్నట్లు బ్యాంకు గుర్తించింది.

డార్క్‌ వెబ్‌లో ఎస్‌బీఐ కస్టమర్ల డేటా?

పేర్లు, ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌లు.. ఏ వివరాలు బయటపడ్డాయి?

బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బు సేఫేనా?

అసలేం జరిగింది?.. ఎస్‌బీఐ ఏమంటోంది?

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన డేటా లీక్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. డార్క్‌ వెబ్‌లో లభించిన సుమారు 3.75 లక్షల రికార్డులను ప్రాథమికంగా పరిశీలించగా, వాటిలో 3,897 రికార్డుల్లో వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం ఉన్నట్లు బ్యాంకు గుర్తించింది. ఈ ఘటనపై ఎస్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, డేటా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? ఎంతమంది కస్టమర్లపై ప్రభావం పడింది? అనే ప్రశ్నలకు ఇంకా పూర్తి సమాధానాలు లభించలేదు.

అసలు ఏం జరిగింది?

డేటా బయటపడే అవకాశం ఉందన్న హెచ్చరికలు అక్టోబర్‌ 16న అందినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. తన థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌, డిఫెన్స్‌ సైబర్‌ ఏజెన్సీ, భారత కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌) నుంచి సమాచారం అందిన నేపథ్యంలో బ్యాంకు ఈ వ్యవహారాన్ని పరిశీలించింది.

డార్క్‌ వెబ్‌లో అందుబాటులో ఉన్న సుమారు 3.75 లక్షల రికార్డుల ప్రాథమిక విశ్లేషణలో 3,897 రికార్డుల్లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు గుర్తించింది. ఈ వివరాల నిజానిజాలు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత మేరకు సమాచారం ప్రభావితమైంది అనే అంశాలను నిర్ధారించాల్సి ఉంది.

ఏయే వివరాలు బయటపడినట్లు గుర్తించారు?

ప్రాథమికంగా గుర్తించిన రికార్డుల్లో కస్టమర్ల పేర్లు, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లు, పుట్టిన తేదీలు, జెండర్, ఈమెయిల్‌ అడ్రస్ లు, ఇంటి చిరునామాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు బ్రాంచ్‌ వివరాలు, కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ ఫైల్‌ (సీఐఎఫ్‌) ఐడెంటిఫయర్లు, లీడ్‌ ఐడీలు, లోన్లకు సంబంధించిన మెటాడేటా కూడా ఉన్నట్లు సమాచారం.

మీ బ్యాంక్‌ ఖాతాలోని డబ్బు సేఫేనా..?

ఈ ఘటనతో కస్టమర్లలో ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న ఇదే. వ్యక్తిగత సమాచారం బయటపడినట్లు గుర్తించినంత మాత్రాన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కూడా చోరీకి గురైందని అర్థం కాదు. ఎస్‌బీఐ తమ కస్టమర్ల ఖాతా నిల్వలు సురక్షితంగానే ఉన్నాయని, ఈ ఘటన తమ ప్రధాన బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపలేదని తెలిపింది.

అయితే, వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళితే వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. బ్యాంకు అధికారులమని చెప్పడం, ఖాతా వివరాలు ధృవీకరించాలంటూ ఫోన్‌ చేయడం, రుణం లేదా కేవైసీ పేరుతో లింకులు పంపడం వంటి పద్ధతుల ద్వారా మోసగాళ్లు కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ ఘటనలో అలాంటి మోసాలు జరిగినట్లు నిర్ధారణ కాలేదు. కానీ వ్యక్తిగత సమాచారం బయటపడిన సందర్భాల్లో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.

కస్టమర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అనుమానాస్పద కాల్స్‌ను నమ్మవద్దు: బ్యాంకు ఉద్యోగులమని చెప్పి ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌ లేదా కార్డు వివరాలు అడిగితే వెల్లడించవద్దు.

తెలియని లింకులపై క్లిక్‌ చేయవద్దు: కేవైసీ అప్‌డేట్‌, ఖాతా నిలిపివేత, రిఫండ్‌ లేదా రుణం పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలను జాగ్రత్తగా పరిశీలించండి.

లావాదేవీలను గమనించండి: మీ బ్యాంకు ఖాతాలో జరిగే లావాదేవీలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచండి. అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించండి.

పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను రహస్యంగా ఉంచండి: ఒకే పాస్‌వర్డ్‌ను అనేక సేవలకు ఉపయోగించకుండా జాగ్రత్త పడండి. బ్యాంకు అధికారిక యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారానే ఖాతా వివరాలను పరిశీలించండి.

మోసం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయండి: సైబర్‌ మోసానికి గురైతే 1930 నేషనల్ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు వెంటనే ఫోన్‌ చేయండి. అవసరమైతే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయండి.

దర్యాప్తులో తేలాల్సిన కీలక అంశాలివే!

డేటా బయటకు రావడానికి కారణమేంటి? అది బ్యాంకు వ్యవస్థల నుంచి వచ్చిందా, ఇతర మార్గాల ద్వారా సేకరించారా..? ఎంతమంది కస్టమర్లకు సంబంధించిన సమాచారం ప్రభావితమైంది? వ్యక్తిగత సమాచారం మాత్రమేనా, లేక ఇతర సున్నితమైన పత్రాలు కూడా ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఘటనపై సమగ్ర పరిశీలన కోసం సెర్ట్‌-ఇన్‌ అనుమతి పొందిన స్వతంత్ర సైబర్‌ సెక్యూరిటీ సంస్థను ఎస్‌బీఐ నియమించింది. డేటా ప్రామాణికత, దాని ప్రభావాన్ని గుర్తించడంతో పాటు అవసరమైన నివారణ చర్యలు చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది.

మొత్తానికి డిజిటల్‌ బ్యాంకింగ్‌ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత సమాచార భద్రత కూడా అంతే కీలకంగా మారుతోంది. ఎస్‌బీఐ డేటా లీక్‌ వ్యవహారంలో పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ, కస్టమర్లు అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా బ్యాంకు పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్‌, మెసేజ్ లు, లింకుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

#SBI Data Leak#SBI Cyber Security#SBI Customer Data#Dark Web Data Leak#State Bank of India#Banking News India#Cyber Crime#Online Banking Safety#Data Breach India#Bank Account Security#Personal Data Protection#Cyber Fraud Alert#SBI News#Digital Banking#India News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి