Bangladesh PM: బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా మైనారిటీలైన హిందువులపై వరుస దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం, ఆలయాల విధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆ దేశ ప్రధాని తారిక్ రహ్మాన్ స్వయంగా దుర్గామాత ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం రంగ్‌పూర్‌లోని ప్రసిద్ధ రాధా గోవింద్ ధర్మ సభ ఆలయాన్ని సందర్శించిన ఆయన, అక్కడ కొలువుదీరిన దుర్గామాత పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి ఆలయ పెద్దలు భవతోష్ సర్కార్, ఖోకోన్ సర్కార్ దగ్గరుండి స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయంలో హాస్టల్ నిర్మాణ పనుల కోసం రూ. 10 లక్షల బంగ్లా టాకాలను తారిక్ రహ్మాన్ విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో ఏ మతానికి చెందిన వారైనా సరే అందరికీ సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఇతర మతాలను, వారి విశ్వాసాలను గౌరవించాలని, అందరినీ సమాన దృష్టితో చూడాలని పిలుపునిచ్చారు. 1971 నాటి విముక్తి పోరాటంలో మతాలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ప్రజలంతా దేశం కోసమే కలిసి పోరాడారని గుర్తుచేశారు. అలాగే 2024 నాటి విద్యార్థి ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ.. ఏ ఉద్యమమైనా వివాదాలకు పోకుండా దేశ భవిష్యత్తు కోసమే సాగాలని సూచించారు.
ఇదే వేదికపై నుంచి రంగ్‌పూర్ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ఏకంగా 1,800 కోట్ల బంగ్లా టాకాల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లు, పాఠశాలలు, కళాశాలలు, కల్వర్టుల నిర్మాణంతో ప్రజలకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీలపై దాడులతో అభద్రతాభావంలో ఉన్న హిందూ సమాజానికి భరోసా ఇచ్చేందుకే ప్రధాని ఈ ఆలయ బాట పట్టారనే చర్చ అంతటా నడుస్తోంది.


