రాజకీయాలు

Telangana: రేవంత్ రెడ్డిని సీఎం చేసిన కేసీఆర్.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు!!..

రచన: Venu•••18 నిమిషాల పఠనం

ఒకప్పుడు కేసీఆర్‌ను సవాలు చేసిన రేవంత్‌.. నేడు ముఖ్యమంత్రిగా అదే కేసీఆర్‌ ను, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో ఇదే అసలు ట్విస్ట్‌! ఒకరి ఆధిపత్యానికి సవాలు విసిరిన పోరాటం, మరొకరి రాజకీయ పతనానికి చిహ్నంగా మారుతుందని ఈ ఘటన నిరూపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి..

ఒక బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతే బలంగా ఆకాశానికి ఎగురుతుంది. అలాగే ఒక వ్యక్తి సహనాన్ని ఎంతగా పరీక్షిస్తే అతను ఉప్పెనై ముంచే వరకు తెలియదు. అక్షరాల తెలంగాణ రాజకీయాల్లో జరిగిన సంఘటన ఇదే.. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ఎంత రాజకీయ యుద్దం జరిగిందో.. ఊహించని పరిణామాలు ఎన్ని చోటుచేసుకున్నాయో అందరికీ తెలిసిందే.. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కూడా తీవ్రమైన చర్చ సాగింది.

అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీ ఇప్పటికీ జనం మరచిపోలేదు. ఇదంత పక్కనపెడితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ దాదాపు 30 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో కొనసాగారు. అయితే మొదటగా యువజన కాంగ్రెస్ ద్వారా 1970 చివరన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, 1985 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తన మొదటి విజయాన్ని అందుకున్నారు.

ఇక టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా 1997-2000 కాలంలో, అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా 1999-2001 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఇంకా రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఈ కాలంలో ఆయన కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఎంపీగా కూడా సేవలందించారు.

అలా సుదీర్ఘ పోరాటాల అనంతరం జూన్ 2, 2014 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో, ఆయన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విధంగా 1980ల ప్రారంభం నుండి 2014 వరకు అంటే సుమారు 34 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం తర్వాత ఆయన సీఎంగా రాష్ట్రానికి రెండు పర్యాయాలు సేవలు అందించారు..

కానీ రేవంత్ రెడ్డికి అంతా సమయం పట్టలేదని తెలుస్తుంది. విద్యార్థి దశలోనే ABVP ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు సుమారు 17 సంవత్సరాలు పట్టింది. ఇక రేవంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయ ప్రయాణం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుండి ప్రారంభం అయ్యింది. స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడి నుండి పోటీ చేసి ZPTC సభ్యుడిగా గెలిచారు.. ఆ తర్వాత 2007 లో స్వతంత్ర అభ్యర్థిగాపోటీచేసి MLCగా ఎన్నికయ్యారు. అనంతరం TDPలో చేరారు..

ఆ పార్టీ అభ్యర్థిగా 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఆతర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2017 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు..

ఈ క్రమంలో 2021లో తెలంగాణ TPCC అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆయనను నియమించింది. అప్పటి నుండి దూకుడుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి.. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో, 7 డిసెంబర్ 2023 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇక్కడే కీలకమైన ట్విస్ట్ నెలకొంది. ఆయన రాజకీయనాయకుడిగానే కీలక పదవుల్లో ఉండేవారేమో!..

ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత, కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యాక.. ఆయనకున్న క్రేజ్ ప్రకారం.. ఒక 20 నుండి 30 సంవత్సరాల వరకు టీఆర్ఎస్-ఇప్పటి బీఆర్ఎస్ దే హవా ఉంటుందని భావించినట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. ఒకవైపు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చావునోట్లో తలపెట్టి అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేశారనే క్రెడిట్.. ఆయన రాజకీయ పరిజ్ఞానం ముందు ఇతర పార్టీల ఎత్తులు పని చేయవనే ఆత్మ విశ్వాసం మరొకవైపు..

అదేవిధంగా బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు కుటుంబ పార్టీగా.. వలసల ప్రోత్సాహంతో ఇతర పార్టీ నేతలతో గులాబీ తోటలో జాగా దొరకడం ఆ సమయంలో కష్టంగా మారిందనే ప్రచారం కూడా ఉంది.. అలా పదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యం సాగించిన కేసీఆర్‌ రాజకీయ శైలిలో.. ప్రత్యర్థులను రాజకీయంగా నిలువరించే వ్యూహాలు.. ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే ఎత్తుగడలు..భాగంగా కనిపించేవి.

కానీ అదే వ్యూహాత్మక రాజకీయ ఆధిపత్యం చివరకు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఊహించనట్టు విశ్లేషకులు చెబుతారు.. ఎందుకంటే అప్పటికే కేసీఆర్ కాంగ్రెస్ ను వంచించి, టీడీపీని టార్గెట్ చేసి రాజకీయాలు చేసినట్టు ఆరోపణలున్నాయి.. ఈ సమయంలో టీడీపీలో రేవంత్ రెడ్డి చురుకైన నాయకుడిగా, అసెంబ్లీలో కేసీఆర్ అక్రమాలను ప్రశ్నించే ఏకైక బలమైన గొంతుకగా ఉన్నారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రక్రియ వేగవంతం చేశారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ప్రారంభించినట్టు కథనాలు వెలువడ్డాయి. కానీ, రేవంత్ రెడ్డి స్వభావం వేరు. కేసీఆర్ ఎంతగా ఇబ్బందులు పెడితే, అంతగా తిరగబడే నైజం ఆయనదని.. రేవంత్ సన్నిహిత వర్గాలలో టాక్ ఉండేదట.. ఈ క్రమంలో 2015లో ఓటుకు నోటు కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్‌కు లంచం ఇవ్వడానికి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి కూడా పంపింది. అప్పట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది.అయితే ఈ ఘటన వెనుక కేసీఆర్‌ వ్యక్తిగత ఆదేశం ఉందనే ఆరోపణలు వచ్చాయి..

ఇది రాజకీయ కక్షగా టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ఆ సమయంలో రేవంత్‌ రాజకీయ జీవితంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు చెబుతారు. అలా తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొంటూనే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం ఆయన వ్యూహంలో కీలకంగా మారినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. మరోవైపు కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో వేసే ఎత్తులు విఫలం అవ్వవని ఈ క్రమంలోనే రేవంత్ ను ఓటుకు నోటు కేసులో ఇరికించి రాజకీయంగా బలహీనపరచాలని చూసినట్టు ఆయన వర్గంలో ప్రచారం జరిగింది..

అయితే ఇలాంటి క్లిష్టపరిస్థితులుఆయనకు మరో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అధికారాన్ని ప్రశ్నించే నాయకుడిగా, వెనక్కి తగ్గని రాజకీయ ప్రత్యర్థిగా ఆయన తన మద్దతుదారుల ముందు నిలిచారు. ఒకరకంగా కేసీఆర్ కు కంట్లో నలుసుగా మారాడు.. ఎందుకంటే 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన కుమార్తె నిశ్చితార్థం జరిగింది. కనీసం కూతురి నిశ్చితార్థానికి వెళ్లేందుకు కూడా బెయిల్ ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకొనట్టు ఆరోపణలున్నాయి.

ఎన్నో ప్రయత్నాల అనంతరం చివరికి కోర్టు నిశ్చితార్థం వేడుక కోసం కేవలం 12 గంటల సమయం మాత్రమే కేటాయించి.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు, పోలీసు వాహనాల నిఘా నడుమ, రేవంత్ రెడ్డి తన కూతురి ఎంగేజ్‌మెంట్ హాజరయ్యారు. ఒకరాజకీయనేత జీవితంలో అత్యంత దారుణమైన ఘటనగా ఈ పరిస్థితిని అంతా భావించారు.. మరోవైపు సొంత కూతురి నిశ్చితార్థానికి కూడా ఖైదీలా వెళ్లాల్సి రావడం రేవంత్ రెడ్డిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు..

ఆ సమయంలో రేవంత్ రెడ్డి అనుభవించిన ఆవేదన, ఆయనకు జరిగిన అవమానం, కేసీఆర్ రాజకీయ సమాధికి పునాదిగా చెప్పుకొంటారు.. ఇక ప్రత్యర్థిని రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నం కొన్నిసార్లు అతడినే మరింత బలమైన నాయకుడిగా తయారు చేస్తుందనే దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలిచాయి.. అలాగే రాజకీయ వేదికపై తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలకు నేపథ్యంగా నిలిచాయని చెప్పుకుంటారు..

ఈ మంట చల్లారాక ముందే.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి రేవంత్‌ అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైంది. కొడంగల్‌లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో తెల్లవారుజామున పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని బెడ్ రూంలో ఉన్న ఆయనను అరెస్టు చేశారు. ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు, కుటుంబ సభ్యుల అభ్యంతరాలు, అరెస్టుకు సంబంధించిన పరిస్థితులపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.

మరోవైపు కాంగ్రెస్‌ నేతలు ఈ ఘటనను రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు.. కానీ ఎక్కడ బలహీనపడని రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టి.. కేసీఆర్ ను సమర్థవంతంగా రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించడం, కేసీఆర్‌ పాలన కుటుంబ పాలన అంటూ విమర్శలు చేయడం, అధికార పార్టీ నిర్ణయాలను ప్రజల్లో చర్చకు తీసుకెళ్లడం ఆయన రాజకీయ శైలిలో భాగమయ్యాయి.

తన రాజకీయానికి అడ్డుగా ఉన్నాడని ఒక నాయకుడిపై తీసుకున్న చర్యలు అతన్ని ప్రజల్లో హీరోగా నిలబెట్టవచ్చు.. అది అధికార పక్షానికి వ్యూహాత్మకంగా ఎదురుదెబ్బ కావచ్చు. రేవంత్‌ విషయంలో నిరూపించింది ఇదే అని పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటారు.. మరోవైపు ఈ అవమానాలు, కేసీఆర్ నియంతృత్వ పోకడ రేవంత్ లో ఒక బలమైన ఆశయానికి ఊపిరిపోసాయని తెలుస్తుంది.

అందుకే పెద్ద దొరది ఫామ్‌హౌజ్ పాలన అని, కుటుంబ పాలన అని, కాళేశ్వరం, పేపర్ లీకేజీలని.. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతి అంశంలోనూ రేవంత్ గళమెత్తారు. ఒత్తిడి తెచ్చారు.. ఆయన ఆడిన పొలిటికల్ గేమ్ బీఆర్ఎస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. అప్పటివరకు రాష్ట్రంలో తమకు ఎదురు లేదు.. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతాడు.. ఈ లోపల కేటీఆర్ కొడుకు హిమాన్షు రావు ను కూడా తెరమీదికి తెచ్చి తెలంగాణ ప్రజలకు పరిచయం చేస్తే.. రాజకీయ వారసత్వం ఎక్కడికి పోదనే భావనలో గులాబీ బ్యాచ్ చేసిన ఆగడాలకు రేవంత్ చర్యలు అడుగడుగున అడ్డుతగిలాయని చెప్పుకుంటారు..

మరోవైపు కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులు ఉన్నప్పటికీ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్‌ తనదైన దూకుడుతో ముందుకు సాగారు. నేరుగా కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ హమయంలో తీవ్రమైన అవినీతి జరుగుతుందని, రాష్ట్ర ప్రజలు దొరల దోపిడికి గురవుతున్నారని చెబుతూనే.. ప్రభుత్వ వైఫల్యాలును ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు..

ఆదేకాకుండా కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.. ఇక్కడే కేసీఆర్‌ రాజకీయ వ్యూహం విఫలం అయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు.. అధికారం కోసం ఎన్ని యాగాలు చేసినా ఫలించకపోవడానికి కారణం.. ఆయన అధికారంలోకి రావడానికి, వచ్చిన తర్వాత చేసిన పాపాలు పండాయనే భావన ప్రజల్లో బలంగా నాటుకునేలా రేవంత్ చేస్తున్నప్పుడు.. బీఆర్ఎస్ టీం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయిందనే ఆరోపణలు మొదలైయ్యాయి..

అదేవిధంగా కేసీఆర్ వ్యూహంలో భాగంగా రేవంత్‌ను రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో ఆయనకు లభించిన ప్రచారం, ప్రజల్లో ఏర్పడిన గుర్తింపు, పోరాట నాయకుడిగా పెరిగిన ప్రతిష్ఠ.. ఇవి చివరకు కాంగ్రెస్‌కు, రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డాయని, ప్రత్యర్థిని పదేపదే లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అతడినే ప్రధాన రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చాయని విశ్లేషకులు అంటున్నారు..

ముఖ్యంగా రేవంత్‌ ఎదుర్కొన్న అరెస్టులు, జైలు జీవితం, 2018 ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్‌లో ఎదురైన సవాళ్లు.. ఇవేవీ ఆయన ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. వాటిని అధిగమిస్తూ ఆయన పార్టీ నాయకత్వాన్ని సంపాదించారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సాగించిన రాజకీయ పోరాటం ఆయనకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. చివరకు అదే రేవంత్‌ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేవరకు నడిపించింది. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే పరిణామాలు ఊహించని మలుపు తిరగవచ్చని 2023 ఎన్నికలు మరోసారి గుర్తుచేశాయి.

ఒకప్పుడు కేసీఆర్‌ను సవాలు చేసిన రేవంత్‌.. నేడు ముఖ్యమంత్రిగా అదే కేసీఆర్‌ ను, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో ఇదే అసలు ట్విస్ట్‌! ఒకరి ఆధిపత్యానికి సవాలు విసిరిన పోరాటం, మరొకరి రాజకీయ పతనానికి చిహ్నంగా మారుతుందని ఈ ఘటన నిరూపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.. అందుకే రేవంత్ రెడ్డిని సీఎం అయ్యేలా రెచ్చగొట్టిన కేసీఆర్.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు.. చివరికి డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది అని అనుకోవడం తప్ప!!..

#Revanth Reddy vs KCR#Telangana Political Analysis#KCR Political Strategy#Revanth Reddy CM Journey#BRS Political Crisis#Telangana Congress Victory#KCR vs Revanth Reddy Story#Telangana Politics 2026#BRS vs Congress#Telangana Political Twist
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి