తెలంగాణ

Jupally: లక్ష ఎకరాలకు సాగునీరు.. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదల

రచన: NK•••7 నిమిషాల పఠనం

ఎల్ నినోతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన వేళ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు ఉపశమనం దక్కింది. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్ లోకి మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిని విడుదల చేయడంతో అదనంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

* నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

* పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

* పనులు పూర్తి కాకుండా నీటిని ఎలా విడుదల చేస్తారు?

* బీఆర్ఎస్ నాయకులకు ఇంగిత జ్ఞానం లేదు

* బీఆర్ఎస్ నేతల విమర్శలకు మంత్రి జూపల్లి కౌంటర్

Jupally: ఎల్ నినోతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన వేళ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు ఉపశమనం దక్కింది. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్ లోకి మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిని విడుదల చేయడంతో అదనంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం

నార్లాపూర్‌, ఎల్లూరు రిజర్వాయర్ల నుంచి 1000 క్యూసెక్కుల ద్వారా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, వనపర్తి నియోజకవర్గాల్లో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం కలగనుందని వివరించారు. సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్‌ భగీరథ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

గత ప్రభుత్వం వదిలేసిన పనులు మేము పూర్తి చేస్తున్నాం

నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం సహా కీలక పనులు ఇంకా కొనసాగుతున్నాయని, అవి పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు మంత్రి జూపల్లి.

మధ్యలోనే నీరు నిలిచిపోయే ప్రమాదం

నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు కాలువల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మూడు చోట్ల తండు తవ్వకాలు చేపట్టాల్సి ఉండటంతోపాటు బ్రిడ్జిల నిర్మాణం కూడా కొనసాగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో రాతి నేల ఉండటంతో తవ్వకాలకు సమయం పడుతోందని వివరించారు. ఈ పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. కాలువల నిర్మాణం పూర్తిచేసి నీటిని సజావుగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

మరో 3 నెలల్లో పనులు పూర్తి

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు చేపట్టాల్సిన పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేది కాదని జూపల్లి అన్నారు. మూడో ప్యాకేజీలో పనులను అసంపూర్తిగా వదిలేయడం వల్లే ప్రస్తుతం వాటిని పూర్తి చేయాల్సి వస్తోందన్నారు. గతంలో నిలిచిపోయిన పనులను ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఈ పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని మంత్రి జూపల్లి తెలిపారు.

గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, కేటీఆర్‌ సహా బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. నీటిని విడుదల చేయాలని కోరడం సులువేనని, అయితే ఆ నీరు కాలువల ద్వారా ఎక్కడికి చేరుతుందో కూడా ఆలోచించాలన్నారు. నిర్మాణ పనులు పూర్తి కాకుండా నీటిని విడుదల చేస్తే ఆశించిన ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించి వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సూచించారు. గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అసంపూర్తి పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

#Jupally Krishna Rao#Palamuru Ranga Reddy#Narlapur Project#Yellur Reservoir#Irrigation Water#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి