TG: తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు.. ఊరూవాడా దావత్ల రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దసరా వేడుకలకు తోడు వరుస సెలవులు రావడంతో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూలు కట్టి పోటీపడి కొనడంతో లిక్కర్ అమ్మకాలు సరికొత్త రికార్డులను తిరగరాశాయి. కేవలం 19 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడై ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. గత ఏడాది దసరా సీజన్‌తో పోలిస్తే అమ్మకాల విలువ ఏకంగా 37.02 శాతం పెరగడం విశేషం.
ఈసారి పండుగ సంబరాల్లో సాధారణ మందు కంటే బీర్ల సేల్స్ ఊహించని రేంజ్లో దూసుకుపోయాయి. ఈ 19 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 30.37 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 8.82 లక్షల కేసుల బీర్లు ఎక్కువగా తాగేశారు. అంటే ఒక్క బీర్ల అమ్మకాల్లోనే ఏకంగా 40.93 శాతం పెరుగుదల కనిపించింది. ఇక విస్కీ, బ్రాందీ లాంటి మిగతా మద్యం రకాల అమ్మకాల్లోనూ 29.80 శాతం వృద్ధి నమోదైంది.
పండుగ వేళ చుట్టాలు, ఫ్రెండ్స్ కలయికలు.. రోజూ సాగిన పార్టీల వల్ల మద్యం దుకాణాలు అర్ధరాత్రి దాకా కిటకిటలాడాయి. పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా కౌంటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. కేవలం రెండున్నర వారాల వ్యవధిలోనే రూ.2 వేల కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడైందంటే తెలంగాణలో దసరా దావత్ల జోరు ఏ లెవల్లో సాగిందో క్లియర్‌గా అర్థమవుతోంది.


