రాష్ట్రంలో అన్నదాతల మీద పోలీసుల దాడులు పెరుగుతున్నాయి. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఓ రైతు పట్ల ఎస్ఐ కర్కశంగా వ్యవహరించారు. తప్పు ఎవరిదో ఆరా తీయకుండా విచక్షణా రహితంగా దాడికి పాల్పడటంతో పాటు దుర్బాషలాడినట్టు కూడా తెలుస్తోంది.ఎస్ఐ దాడిలో సదరు రైతు తలకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రక్తం వచ్చేలా అన్నదాతను గాయపరిచిన పోలీసును వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకివెళితే.. గజ్వేల్‌కు చెందిన భీమరి రవి అనే యువరైతు తన సమస్య చెప్పుకునేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన వ్యవసాయ పొలంలో పంట సాగు విషయంలో పొరుగువారితో వివాదం తలెత్తిన నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది.
అయితే, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తనపై ఎస్ఐ మల్లారెడ్డి ఎలాంటి కారణం లేకుండానే దాడి చేశారని, రక్తం వచ్చేలా కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యను వివరించి న్యాయం కోరేందుకు వెళ్లిన తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే తనపై చేయి చేసుకున్నారని ఆరోపించడం తీవ్ర చర్చకు దారితీసింది.
కరెంటు ఎప్పుడు వస్తుందని ఎస్ఐ అడుగగా తనకు తెలియదని సమాధానం ఇచ్చానని బాధితుడు రవి పేర్కొన్నాడు. దీంతో పీకడానికి వ్యవసాయం చేస్తున్నావా? అంటూ ఎస్ఐ తనను కొట్టాడని, రక్తం కారుతున్నా కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని బాధితుడు కోరాడు. స్టేషన్‌లో అసలు ఏం జరిగింది? రైతుపై దాడి జరిగిందా? జరిగితే అందుకు కారణాలేమిటి? బాధితుడి ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉంది.
హరీశ్ రావు రియాక్షన్..
గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో యువరైతుపై ఎస్ఐ దాడి చేశారని విషయం తెలిసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘రైతన్నపై అమానుషం. కాంగ్రెస్ పాలనలో అన్నదాత బతుకే ప్రశ్నార్థకం!. మొన్న “నువ్వు ఇంకా సచ్చిపోలేదా?” అంటూ ఓ తహసీల్దార్ అవమానం. నేడు కరెంట్ గురించి అడిగిన పాపానికి రైతు ముఖంపై ఎస్సై లాఠీ దెబ్బలు! ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.


