ఐపీఎల్-2027 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రధాన హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ కీరన్ పొలార్డ్‌ను నియమిస్తూ శనివారం అధికారిక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుంది. అయితే, ఐదునెలల ముందునే ముంబై జట్టులో కీలక మార్పులకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది.ఎందుకంటే గత ఐదు సీజన్లలో ముంబై ఇంతవరకు టైటిల్ గెలవలేకపోయింది. ఇప్పటి నుంచి మార్పులు చేస్తేనే టోర్నీ ప్రారంభమయ్యాక జట్టు మంచి ప్రతిభను కనబరుస్తుందని ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
బెస్ట్ ఆల్ రౌండర్.. ఇప్పడు హెడ్ కోచ్
ముంబై ఇండియన్స్ తరఫున కీరన్ పొలార్డ్ సుదీర్ఘకాలం మైదానంలో ఆడారు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు అద్భుత విజయాలను అందించారు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా, ఎంఐ గ్లోబల్ ఫ్రాంచైజీల్లో వివిధ బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు నేరుగా ప్రధాన కోచ్ పగ్గాలు చేపట్టనుండటంతో ఫ్రాంచైజీ వర్గాలు, అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
గతంలో ముంబై జట్టు 5 ఐపీఎల్ ట్రోఫీలు, 2 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు సాధించడంలో కీరన్ పొలార్డ్ పాత్ర ఎనలేనిది.ఆటపై అపారమైన అవగాహన, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను సమన్వయం చేసుకునే సమర్థత ఆయనకు ఉంది. యువ ప్రతిభను తీర్చిదిద్దడంలో ఎంతో నైపుణ్యం ఉంది.ఈ నేపథ్యంలోనే ముంబై యాజమాన్యం ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచుతూ హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది.
వచ్చే ఏడాది టైటిల్ నెగ్గేనా?
వచ్చే ఐపీఎల్ సీజన్లలో సరికొత్త వ్యూహాలతో జట్టును మళ్లీ విజయపథంలో నడిపించేందుకు పొలార్డ్ నియామకం ఎంతగానో ఉపయోగపడుతుందని ముంబై యాజమాన్యం భావించింది. విధ్వంసకర బ్యాటర్‌గా పేరున్న పొలార్డ్..డెత్ ఓవర్లు కూడా వేసే సత్తా ఉంది. ముంబై జట్టులో ఒకప్పుడు ఆల్ రౌండర్. తాజాగా హెడ్‌కోచ్ రూపంలో సరికొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.పొలార్డ్ మార్గదర్శకత్వంలో ముంబై వచ్చే సీజన్‌లో టైటిల్ గెలుస్తుందా? అనేది వేచిచూడాల్సిందే.
ఐదేళ్లుగా నో టైటిల్
కాగా, 2025, 2026 సీజన్లలో హెడ్ కోచ్‌గా మహేల జయవర్ధనే పనిచేశారు. ఆయన సారథ్యంలో జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. అందుకే ఆయన స్థానంలో తాజాగా పొలార్డ్‌కు బాధ్యతలు అప్పగించారు. గత ఐదు సీజన్లలో 2022 నుంచి 2026 వరకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. 2023, 2025 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్ నెగ్గలేదు. 2022, 2024లో చివరి స్థానంలో నిలిచింది. 2026లో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది.


