సముద్రపు అగాధాల నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ అరుదైన భారీ జీవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు కారణమవుతోంది. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశానికి చెందిన 'అరికా' (Arica) బీచ్ తీరంలో సుమారు 16 అడుగుల భారీ పొడవున్న అరుదైన 'ఓర్ఫిష్' (Oarfish) ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఈ చేపను ‘డూమ్స్‌డే ఫిష్’ (Doomsday Fish) లేదా ‘ప్రళయ చేప’ అని పిలుస్తుంటారు. సముద్ర గర్భంలో నివసించే ఈ చేప తీరానికి వస్తే త్వరలోనే భారీ భూకంపాలు, తీవ్ర సునామీలు విరుచుకుపడతాయనే నమ్మకం కొన్ని దేశాల్లో పూర్వీకుల నుంచి గట్టిగా నమ్ముతున్నారు.
శాస్త్రీయంగా 'రీగాలేకస్ గ్లెస్నే' (Regalecus glesne) అని పిలిచే ఈ ఓర్ఫిష్ సముద్రంలో సుమారు 3,300 అడుగుల (మెసోపెలాజిక్ ప్రాంతం) లోతులో నివసిస్తుంది. పొడవైన రిబ్బన్ ఆకారపు వెండి శరీరం, తలపై ఎరుపు రంగు కిరీటం లాంటి రెక్కలు దీని ప్రత్యేకత. జపాన్ జానపద కథల్లో దీనిని 'ర్యూగు నో సుకై' (సముద్ర దేవుడి దూత)గా పిలుస్తారు. 2011లో జపాన్ను ముంచెత్తిన ఘోర సునామీ, తోహోకు భూకంపానికి కొద్ది నెలల ముందు డజన్ల కొద్దీ ఓర్‌ఫిష్‌లు తీరానికి కొట్టుకురావడం ఈ నమ్మకానికి మరింత బలాన్ని చేకూర్చింది.
ఈ నేపథ్యంలో ఇటీవల చిలీ బీచ్‌లో ఒకటి కంటే ఎక్కువ ఓర్‌ఫిష్‌లు కొట్టుకువచ్చాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భూకంప భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే, ఈ ప్రళయ చేప ఒడ్డుకు రావడం నిజంగానే ప్రకృతి విపత్తుకు సంకేతమా? అన్న దానిపై సముద్ర శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. ఓర్ఫిష్ తీరానికి కొట్టుకురావడానికి, భూకంపాలు లేదా సునామీలు సంభవించడానికి మధ్య ఎలాంటి ప్రత్యక్ష శాస్త్రీయ సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఓర్‌ఫిష్‌లు చాలా బలహీనమైనవి. దీంతో సముద్రపు అడుగున ప్రవాహాల మార్పులు, శారీరక అనారోగ్యం, వయోభారం లేదా గాయాల కారణంగా దారితప్పి ఉపరితలానికి కొట్టుకొస్తుంటాయని నిపుణులు వివరించారు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ ప్రచారాలను, పాత నమ్మకాలను చూసి ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, విపత్తు సమాచారం కోసం కేవలం అధికారిక భూకంప పర్యవేక్షణ కేంద్రాల హెచ్చరికలనే ప్రామాణికంగా తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


