యువరైతు భీమరి రవి మీద దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న గజ్వేల్ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ మల్లారెడ్డిపై వేటు పడింది.తీవ్ర రక్తస్రావంతో గజ్వేల్ పీఎస్‌లో ఉండి యువరైతు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.ఆయనను సీఏఆర్ (CAR) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సమస్య పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన రైతు మీద దాడి చేస్తారా? అంటూ ప్రతిపక్షాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకివెళితే.. గజ్వేల్‌కు చెందిన భీమరి రవి అనే యువరైతు తన సమస్య చెప్పుకునేందుకు స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన వ్యవసాయ పొలంలో పంట సాగు విషయంలో పొరుగువారితో వివాదం తలెత్తిన నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది.
అయితే, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తనపై ఎస్ఐ మల్లారెడ్డి ఎలాంటి కారణం లేకుండానే దాడి చేశారని, రక్తం వచ్చేలా కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యను వివరించి న్యాయం కోరేందుకు వెళ్లిన తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే తనపై చేయి చేసుకున్నారని ఆరోపించడం తీవ్ర చర్చకు దారితీసింది. కరెంటు ఎప్పుడు వస్తుందని ఎస్ఐ అడుగగా తనకు తెలియదని సమాధానం ఇచ్చానని బాధితుడు రవి పేర్కొన్నాడు. దీంతో పీకడానికి వ్యవసాయం చేస్తున్నావా? అంటూ ఎస్ఐ తనను కొట్టాడని, రక్తం కారుతున్నా కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా స్టేషన్లోనే కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని బాధితుడు కోరాడు. పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరిగింది? రైతుపై దాడి జరిగిందా? జరిగితే అందుకు కారణాలేమిటి? బాధితుడి ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాల గురించి తెలియాల్సి ఉంది.ఈ క్రమంలోనే రైతు మీద దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్ఐ మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం.


