కనిపించకుండా పోయిన తన భర్తను కనిపెట్టే క్రమంలో పోలీసులకు పట్టించింది ఓ భార్య. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్తను కనిపెట్టి ఇవ్వాలని పోలీసులను ఆశ్రయిస్తే వారేమో ఆయన్ను అరెస్టు చేశారని సదరు బాధితురాలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే మిస్సింగ్ పర్సన్ అంత పెద్ద నేరంలో సూత్రధారిగా ఉండటమే కారణం..
వివరాల్లోకివెళితే.. కనిపించకుండా పోయిన వ్యక్తి ఇంట్లో భారీ ఎత్తున దొంగ నోట్లను ముద్రించే సెటప్‌ను పోలీసులు కనిపెట్టారు. ఈ ఘటన కేరళంలో చోటుచేసుకుంది.కొల్లాం సిటీ పరిధిలోని వాడి, కల్లెలివయల్కు చెందిన సిబియాన్ అనే వ్యక్తి ఈనెల 16న అదృశ్యమయ్యాడు. దీంతో అతని భార్య టిన్సీ పల్లితోట్టం పీఎస్‌లో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కొల్లాం సిటీ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ బృందం శనివారం సిబియాన్ ఇంట్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది.
ఈ సోదాల్లో సుమారు రూ. 2.5 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని ముద్రించేందుకు ఉపయోగించిన అత్యాధునిక ప్రింటింగ్ యంత్రాలు, ప్రత్యేక కాగితాలు, రసాయనాలు, సంబంధిత సామగ్రిని చూసి పోలీసులు, నార్కోటిక్ బృందాలు కంగు తిన్నాయి. దీంతో విచారణ స్పీడప్ చేసిన పోలీసులు వెంటనే సిబియాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అతని అదృశ్యం డ్రామా వెనుక గల అసలు కారణాలు, ఈ దొంగనోట్ల తయారీ దందా వెనుక ఎవరి హస్తం ఉంది? అనే కోణంలో కూపీ లాగుతున్నారు. భారీ ఎత్తున నకిలీ కరెన్సీని ముద్రించి ఎక్కడెక్కడ చలామణి చేశారు? రాష్ట్రవ్యాప్తంగా, అంతర్రాష్ట్ర స్థాయిలో ఇతర హవాలా, క్రిమినల్ ముఠాలతో సిబియాన్కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద ప్రింటింగ్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టు ఎదుట హాజరుపరిచి కస్టడీకి తీసుకున్నట్టు సమాచారం.


