తెలంగాణ

TG : మహబూబ్‌నగర్‌లో అమానుషం..రైతు చొక్కా పట్టుకుని లాక్కెళ్లి ఎస్ఐ దాడి

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో అన్నదాతలకు ఆవేదన తప్ప ఇంకేం మిగలడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల పుణ్యమా అని సాగుకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో పాటు తమ భూమిని లాక్కుంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.

రాష్ట్రంలో అన్నదాతలకు ఆవేదన తప్ప ఇంకేం మిగలడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల పుణ్యమా అని సాగుకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో పాటు తమ భూమిని లాక్కుంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే,రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేపట్టినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం బెదిరించి మరీ భూములు లాక్కున్నదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, భూములు తీసుకున్నాక పరిహారం చెల్లించడంలోనూ తమకు అన్యాయం జరిగిందని కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా పరిహారం చెల్లించే వరకు తమ భూములను ఇవ్వడం కుదరదని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో ఓ రైతు తనకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం ప్రభుత్వానికి ఎదురుతిరిగాడు. జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ గ్రామంలో రిజర్వాయర్ కోసం నర్సింహులు అనే రైతు 1.28 ఎకరాల భూమిని ఇచ్చాడు. అందులో 20 గుంటలకు ఇంతవరకు పరిహారం రాలేదని ఆందోళన చెందాడు. అధికారులను ప్రశ్నించగా వారి నుంచి సమాధానం కరువైంది.దీంతో ఏం చేయాలో తెలియక తనకు పరిహారం వచ్చేంత వరకు ఆ 20 గుంటల భూమిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తనకు పరిహారం అందని 20 గుంటల్లో సాగు చేసేందుకు వెళ్లగా ప్రాజెక్టు కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించినట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మల్లేశ్.. రైతు నర్సింహులుపై చేయి చేసుకుని, చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలోనే సదరు రైతు కాంట్రాక్టర్, పోలీసుల కాళ్లు మొక్కినట్టు తెలుస్తోంది.అయినప్పటికీ అన్నదాతను వారు కరుణించలేదు. రైతు కాల్ పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెనుగులాటలో అన్నదాత చొక్కా పూర్తిగా చిరిగిపోయినట్టు సమాచారం. కాగా, దేశానికి అన్నం పెట్టే రైతన్న పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఎస్ఐ మల్లేష్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

#sub inspector#farmer#beaten#mahaboobnagar#indemnity issue#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి