తెలంగాణ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం బ్యారేజీ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను కేంద్ర జలసంఘం (CWC) వెనక్కి పంపింది. ప్రాజెక్టుకు సంబంధించిన కమాండ్ ఏరియా (ఆయకట్టు) వివరాలు, 2011 నాటి ప్రమాణాలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం నివేదికలో స్పష్టంగా లేదని పేర్కొంది.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల మరో ఇరిగేషన్ ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.ఏపీకి మేలు చేసేందుకే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడింది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కింద ఎంత భూమి సాగులోకి వస్తుందనే వివరాలు పొందుపరచకపోవడం, ఇతర వివరాలు కూడా సరిగ్గా చెప్పకపోవడంతో డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల శాఖవెనక్కి పంపిందని వెల్లడించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు నీళ్లు అందించేందుకు రూ. 9,257 కోట్లతో సమ్మక్క సాగర్ పనులను పూర్తి చేశారు.అయితే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఎన్ఓసీ తెచ్చుకుంటే ప్రాజెక్టుకు పూర్తి క్లియరెన్స్ ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముంపు ప్రాంతాలపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర డిమాండ్లను మూడేళ్లలో కూడా పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం ఏపీకి మేలు చేసేందుకే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కాగా,గతంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సైతం కేంద్రం తిప్పి పంపిన విషయం తెలిసిందే.
కాగా, సమ్మక్కసాగర్‌కు పూర్తి క్లియరెన్స్ వచ్చి నిర్మాణం పూర్తయితే జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఉన్న 2,51,310 హెక్టార్లు, అలాగే శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-1 & 2 కింద ఉన్న 3,04,000 హెక్టార్ల ఆయకట్టుకు సుమారు 50 టీఎంసీల నీటిని అందుతుంది. మరో 50 టీఎంసీల నీటిని పరిసర గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. గోదావరి నదిపై రన్-ఆఫ్-ది-రెవర్ విధానంలో 240 మెగావాట్ల (10 యూనిట్లు x 24 MW) జల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని తెలంగాణ జెన్కో ప్రణాళిక సైతం రూపొందించింది.


