రాష్ట్రంలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన 22 మంది వ్యక్తులను చనిపోయినట్టు చిత్రీకరించి వారి పేరిట ఉన్న బీమా సొమ్మును క్లెయిమ్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి బాధిత వ్యక్తులు లబోదిబోమంటున్నారు. దీంతో వెంటనే చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
వివరాల్లోకివెళితే.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన 22 మంది పేర్లపై నకిలీ మరణ ధ్రువపత్రాలు జారీ అయ్యాయి. వారంతా బతికే ఉన్నా డెత్ సర్టిఫికెట్లు జారీ అవ్వడం కలకలం రేపింది. రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న భూక్య మధు తన అధికారిక ఈ-సైన్ (e-Sign) డాంగిల్‌ను దుర్వినియోగం చేసినట్టు తెలిసింది.
అనగా దానిని నిర్లక్ష్యంగా హైదరాబాద్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న షేవల్ల రమేష్ అనే వ్యక్తికి అప్పగించాడు. దాని పవర్ గురించి తెలుసుకున్న రమేశ్.. ఆ డిజిటల్ సంతకాన్ని దుర్వినియోగం చేశాడు. రాంపూర్ గ్రామంలో జీవించి ఉన్న 22 మంది మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించాడు. 2026 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్టిఫికెట్లు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికెట్లను ఉపయోగించి కొందరి పేరిట ఉన్న ఇన్సూరెన్స్ (బీమా) క్లెయిమ్‌లు పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీఓ ఫిర్యాదుతో చేర్యాల పోలీసులు పంచాయతీ కార్యదర్శి భూక్య మధు, ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి, ఇంటర్నెట్ నిర్వాహకుడిని ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలిసింది.


