ఢిల్లీలో మీటర్లకే అందనంత కాలుష్యం..!
కళ్ల ముందు.. కనిపించని విషం..
పీల్చే గాలిలోనే ప్రమాదం!
హైదరాబాద్ భవిష్యత్ ఏంటి..?
ఢిల్లీలో గాలి కాదు.. విషం పీలుస్తున్నారా? దేశవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. రాజధాని ఢిల్లీ పేరు చెబితే గుర్తొచ్చేది రాజకీయాలు, అధికార కేంద్రాలు, భారీ భవనాలు. కానీ ఇప్పుడు ఢిల్లీని చూస్తే మరో విషయం గుర్తుకొస్తోంది. అదే.. గాలి కాలుష్యం. నగరంలోకి అడుగుపెడితే చుట్టూ పొగమంచులా కనిపిస్తుంది. రోడ్లు కనిపించవు. దూరంగా ఉన్న భవనాలు కనిపించవు. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కారణం చలి కాదు.. గాలిలో పెరిగిపోయిన కాలుష్యం.
నవంబర్ 9న ఢిల్లీ సగటు AQI 370కి చేరింది. కొన్ని ప్రాంతాల్లో 400 కూడా దాటింది. అంటే గాలి నాణ్యత చాలా దారుణంగా ఉందన్నమాట. దీపావళి సమయంలో కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం మరింత తీవ్రంగా నమోదైంది.
ఇక్కడ మరో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యాన్ని కొలిచే యంత్రాల్లో కొన్ని రీడింగ్స్ గరిష్ఠ స్థాయులకు చేరుతున్నాయి. ఢిల్లీలోని నార్త్ క్యాంపస్ ప్రాంతంలో PM2.5 స్థాయి ఒక సమయంలో క్యూబిక్ మీటరుకు 999 మైక్రోగ్రాములకు చేరినట్లు తెలుస్తోంది. అంటే మనం పీల్చే గాలిలో ఎంతటి ప్రమాదకరమైన చిన్న చిన్న ధూళి కణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఈ కాలుష్యం ఒక్కరోజులో పెరిగిపోయిందా? కానే కాదు. వాహనాల పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం, రోడ్లపై దుమ్ము, నిర్మాణ పనులు, పంట వ్యర్థాలను కాల్చడం.. ఇలా అనేక కారణాలు ఏళ్లుగా సమస్యను పెంచుతున్నాయి. దీనికి తోడు చలికాలంలో గాలి వేగం తగ్గిపోవడంతో కాలుష్యం ఒకేచోట పేరుకుపోతోంది. ఫలితంగా ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.
మరి హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటి?
ఢిల్లీ పరిస్థితి చూసి హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఇప్పుడు వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు చెరువులు, చెట్లు, ఖాళీ స్థలాలతో కనిపించిన నగరం.. ఇప్పుడు భారీ భవనాలు, ఫ్లైఓవర్లు, రోడ్లు, నిర్మాణ ప్రాజెక్టులతో విస్తరిస్తోంది. ఐటీ కంపెనీలు పెరుగుతున్నాయి. కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. రోజురోజుకూ కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.
అభివృద్ధి మంచిదే. కానీ ఈ అభివృద్ధి కోసం మనం పీల్చే గాలిని బలి చేస్తున్నామా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఢిల్లీలో కనిపిస్తున్న పరిస్థితి హైదరాబాద్‌లోనూ రావడానికి అవకాశం ఉందా? హైదరాబాద్ గాలి కూడా నెమ్మదిగా విషపూరితంగా మారుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మన నగరంలోని కాలుష్య పరిస్థితులను కూడా చూడాలి.
హైదరాబాద్‌లోనూ కాలుష్యం పెరుగుతోందా?
హైదరాబాద్‌లో పరిస్థితి ఢిల్లీ అంత దారుణంగా లేకపోయినా.. సమస్య లేదని మాత్రం అనుకోలేం. 2025లో విడుదలైన ఒక స్టడీ ప్రకారం, 2024 అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు హైదరాబాద్‌లో గాలిలోని PM2.5 సగటు స్థాయి 52గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సనత్‌నగర్‌లో ఒక రోజున ఈ స్థాయి 182కు చేరింది. అంటే నగరమంతా ఒకేలా లేదు. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగున్నా.. మరికొన్ని ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటోంది.
ముఖ్యంగా పటాన్‌చెరు, బొల్లారం, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లు, నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఢిల్లీ కంటే మనం కాస్త బెటరేనా..?
ఢిల్లీ, హైదరాబాద్ నగరాల మధ్య వాతావరణ పరిస్థితుల్లో తేడా ఉంది. ఢిల్లీలో చలికాలంలో గాలి కదలికలు తగ్గి కాలుష్యం ఒకేచోట పేరుకుపోతుంది. హైదరాబాద్‌లో సాధారణంగా గాలి కదలికలు కొంత మెరుగ్గా ఉంటాయి. అందుకే ఢిల్లీలో ఉన్న పరిస్థితి రేపు హైదరాబాద్‌లోనూ వస్తుందని చెప్పలేం.
కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నగరం పెరుగుతున్న కొద్దీ వాహనాలు పెరుగుతాయి. నిర్మాణాలు పెరుగుతాయి. రోడ్లపై దుమ్ము పెరుగుతుంది. పరిశ్రమల నుంచి వచ్చే పొగ కూడా గాలి నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇవన్నీ నియంత్రించకపోతే హైదరాబాద్‌లోనూ కాలుష్యం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా మనం పట్టించుకోవాల్సిన మరో విషయం ఉంది. మనం పీల్చే గాలిలో ఉండే అతి చిన్న ధూళి కణాలు. వీటిని PM2.5 అంటారు. ఇవి కంటికి కనిపించవు. కానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దగ్గు, ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె సంబంధిత సమస్యల ముప్పును పెంచుతాయి. అంటే కాలుష్యం అనేది రోడ్లపై కనిపించే దుమ్ము మాత్రమే కాదు. మన కంటికి కనిపించకుండా శరీరంలోకి వెళ్లే ప్రమాదం కూడా.
మనం ఇప్పటి నుంచే ఏం చేయాలి?
కాలుష్యం పెరిగిపోయిన తర్వాత మాస్కులు పెట్టుకోవడం, ఆసుపత్రులకు వెళ్లడం కంటే.. ముందే జాగ్రత్త పడటం మంచిది. మరి సాధారణ ప్రజలుగా మనం ఏం చేయాలి? బయటకు వెళ్లే ముందు మన ప్రాంతంలోని AQI ఎంత ఉందో తెలుసుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉదయం వాకింగ్, బయట వ్యాయామం తగ్గించాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మంచి నాణ్యత కలిగిన N95 మాస్క్ ఉపయోగించాలి.
ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూడాలి. ఇంటి దగ్గర చెత్త, ప్లాస్టిక్, చెట్ల ఆకులు కాల్చకూడదు. అవసరం లేని ప్రయాణాలకు వాహనాలు ఉపయోగించకుండా ఉండాలి. వాహనాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము బయటకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచడం మంచిది కాదు. గాలి నాణ్యతను బట్టి ఇంట్లోకి గాలి వచ్చే సమయాన్ని నిర్ణయించుకోవాలి.
ప్రభుత్వాలు ఇప్పుడే మేల్కొంటాయా?
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యం. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని కొలిచే కేంద్రాలను మరింత పెంచాలి. ఏ ప్రాంతంలో ఎంత కాలుష్యం ఉందో ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాలి. పరిశ్రమల నుంచి వచ్చే పొగను నియంత్రించాలి. రోడ్లపై దుమ్ము పేరుకుపోకుండా చూడాలి. నిర్మాణ సంస్థలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయాలి.
కేవలం చెట్లు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోదు. ఉన్న చెట్లను కాపాడాలి. చెరువులు, పచ్చని ప్రాంతాలను సంరక్షించాలి. నగర అభివృద్ధి ప్రణాళికల్లో పర్యావరణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
చివరగా ఒక్కసారి ఆలోచించండి!
ఢిల్లీ పరిస్థితి చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కాలుష్యం ఒక్కసారిగా రాదు. మనం చేసే చిన్న చిన్న తప్పులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, నియంత్రణ లేని అభివృద్ధి.. ఇవన్నీ కలిసి ఒకరోజు పెద్ద సమస్యగా మారతాయి. హైదరాబాద్ ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలని కోరుకుంటున్నాం. భారీ రోడ్లు కావాలి. కొత్త ఐటీ కంపెనీలు రావాలి. పెట్టుబడులు పెరగాలి. ఇవన్నీ అవసరమే. కానీ అదే సమయంలో మనకు స్వచ్ఛమైన గాలి కూడా కావాలి.
ఒక్కసారి ఊహించుకోండి. రేపు మన పిల్లలు బయటకు వెళ్లాలంటే మాస్కులు తప్పనిసరి అయ్యే పరిస్థితి వస్తే? పార్కుల్లో ఆడుకోవాలంటే కాలుష్యం తగ్గే వరకు ఎదురుచూడాల్సి వస్తే? ఉదయం వాకింగ్ చేయాలంటే ముందుగా AQI చూసుకోవాల్సి వస్తే? అంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా..? అది అభివృద్ధి చెందిన హైదరాబాద్ అవుతుందా?
ఢిల్లీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యను హైదరాబాద్ రేపు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కానీ దానికోసం ఈరోజే మేల్కోవాలి. ఎందుకంటే డబ్బుతో ఇళ్లు కొనగలం.. కార్లు కొనగలం.. కానీ స్వచ్ఛమైన గాలిని కొనుక్కోలేం. ఇది ప్రభుత్వాలతో పాటు ప్రతి పౌరుడికీ ఒక హెచ్చరికే. మన నగరాన్ని మనమే కాపాడుకుందాం....


