తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) మాస్టర్ ప్లాన్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంది. సింగపూర్‌కు చెందిన ప్రఖ్యాత ‘డీపీ ఆర్కిటెక్ట్స్’ (DP Architects) సంస్థ అంతర్జాతీయ ప్రామాణికాలతో ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారుల మధ్య మొత్తం 1.80లక్షల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ నగరం మాస్టర్ ప్లాన్‌ను త్వరలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనుంది.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) పరిధిలోని 7 మండలాలు, 71 రెవెన్యూ గ్రామాల సమగ్ర వికాసం లక్ష్యంగా ఈ ప్లాన్ తయారు చేశారు. నగరాల అస్తవ్యస్త విస్తరణను అరికడుతూ 2047 నాటి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పర్యావరణ సమతుల్యతతో కూడిన ‘నెట్-జీరో స్మార్ట్ సిటీ’గా దీనిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. భూ వినియోగ ప్రణాళిక కింద నివాస, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక జోన్లను స్పష్టంగా వర్గీకరించారు.
ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR)లతో పాటు జాతీయ రహదారులకు రవాణా అనుసంధానం ఉండేలా డిజైన్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) నిబంధనల మేరకు చెరువులు, నాలాలు, అటవీ ప్రాంతాల పరిరక్షణకు ప్రత్యేక మార్గదర్శకాలు నిర్దేశించారు. ఈ మాస్టర్ ప్లాన్‌లో వివిధ రంగాల అభివృద్ధికి గాను నిర్దిష్ట కేటాయింపులు చేశారు. లైఫ్ సైన్సెస్ హబ్‌కు 4వేల ఎకరాలు, నివాస రంగానికి 2,477 ఎకరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు-ఎనర్జీ పార్కులకు 1,976 ఎకరాలు ప్రత్యేకించారు. వీటితో పాటు హెల్త్ సిటీకి 594 ఎకరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీకి 403 ఎకరాలు, డేటా సెంటర్ హబ్‌కు 313 ఎకరాలు, ఎడ్యుకేషన్ హబ్‌కు 255 ఎకరాలు కేటాయించారు.
పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూనే ఉద్యోగుల నివాసం, విద్య, వైద్యం వంటి సామాజిక వసతులకు సమంగా కేటాయించారు. మరోవైపు మాస్టర్ ప్లాన్ ఖరారైన నేపథ్యంలో తమ భూములు ఏ జోన్ పరిధిలోకి వెళ్తాయోననే ఉత్కంఠ స్థానిక రైతులు, భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో నెలకొంది. భూసేకరణ, పరిహారం, రైతుల హక్కుల పరిరక్షణ వంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


