Kavitha: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. సీఎం రేవంత్ ను కరప్షన్ కింగ్ గా, అవినీతి సామ్రాట్ గా అభివర్ణించారు. నాకెందుకు కమీషన్లు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు అంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కవిత. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ మాటలను తీవ్రంగా ఖండించారు.
మీ గడ్డ మీద నిలబడి.. మీ పాపాల చిట్టా విప్పుతా
రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మూసీ నుంచి ఇసుక వరకు ప్రతీ దాంట్లో మీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈ అంశాలన్నీ చెప్పేందుకు, ప్రజల ముందు తేటతెల్లం చేయడానికి, మీ పాపాల చిట్టా విప్పేందుకే ఈ నెల 20న కొడంగల్ కు వస్తున్నామని కవిత చెప్పారు. టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ పెడుతున్నామన్నారు. మీ నియోజకవర్గంలో మీ గడ్డ మీద నిలబడి మీరు చేసిన అవినీతిని మొత్తం తెలంగాణ ప్రజలకు చెప్పబోతున్నామని కవిత ప్రకటించారు.
విద్యాశాఖ మంత్రిగా, హోంమంత్రిగా అట్టర్ ప్లాఫ్
సీఎం రేవంత్ మాటలకు, చేతలకు పొంతనే లేదని కవిత విమర్శించారు. దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. విద్యాశాఖ మంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యారని కవిత అన్నారు. ''ఆంధ్రా వాళ్ల పక్షాన చేరి తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించాలనే ఉద్దేశంతో మీరు డైరెక్ట్ గా క్యాష్ డీలింగ్ చేస్తూ దొరికిపోయిన మాట తెలంగాణ ప్రజలకు గుర్తు లేదా? ఇవన్నీ పక్కన పెట్టి నేను స్వాతి ముత్యాన్ని అన్నట్లుగా మీరు మాట్లాడుతుంటే చూసేటోళ్లంతా నవ్వుకుంటున్నారు'' అంటూ ముఖ్యమంత్రి రేవంత్ పై విరుచుకుపడ్డారు కవిత.












