గణేశ్ నవరాత్రుల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. వేడుకల నిర్వహణ, బందోబస్తు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు, నిర్వాహకులతో నేరుగా సమీక్షించే సంప్రదాయాన్ని పునరుద్ధరించామన్నారు.
నిర్వాహకుల సమస్యలు తెలుసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. నిర్వాహకులు ముందుగా అధికారులకు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని కోరారు. మండపాల ఏర్పాటు సమాచారాన్ని స్థానిక కమిషనరేట్లకు అందించాలని, దీంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురైనా తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుందన్నారు.
నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు..
అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ వేడుకలకు అవకాశం కల్పించినట్టే గణేశ్ నిమజ్జనాలకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం కోసం చెరువుల చుట్టూ క్రేన్ల ఏర్పాటుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గణేశ్ నవరాత్రులు పూర్తయ్యే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక ‘కంట్రోల్ రూమ్’ ఏర్పాటు చేసి నవరాత్రుల వేడుకలను పర్యవేక్షించాలన్నారు. నిర్వాహకులతో సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు, మండప నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని సీఎం కోరారు. ఉత్సవాల నిర్వహణలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హామీ ఇచ్చారు.












