తెలంగాణ

Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Ponguleti Srinivasa Reddy : గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ముసుగులో సాగించిన భూదందాపై శాసనసభ వేదికగా పెను దుమారం రేగింది. ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపడుతోందని చెబుతూనే, గత బీఆర్ఎస్ పాలనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ముసుగులో సాగించిన భూదందాపై శాసనసభ వేదికగా పెను దుమారం రేగింది. ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపడుతోందని చెబుతూనే, గత బీఆర్ఎస్ పాలనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

దివాళా తీసిన విదేశీ సంస్థకు తెలంగాణ భూముల గుట్టు

రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాల భూమిని గత పాలకులు తమ సొంత జాగీరులా భావించారని పొంగులేటి తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఏకంగా దివాళా తీసిన ఓ విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టారని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. పోర్టల్‌ను పూర్తిగా తమ కనుసన్నల్లో ఉంచుకుని, సామాన్యులకు తెలియకుండా అర్ధరాత్రి వేళల్లో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని విమర్శించారు.

ధరణి సృష్టించిన శ్మశాన వైరాగ్యం.. వందలాది రైతుల బలిదానం

పోర్టల్‌లో ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులు, లోపాల కారణంగా లక్షలాది మంది అమాయక రైతులు ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత భూమిపై హక్కులు దక్కక, అధికారుల చుట్టూ తిరగలేక నిస్సహాయ స్థితిలో వందల సంఖ్యలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేవలం స్వప్రయోజనాలకు, కుటుంబ ప్రయోజనాలకే వాడుకున్నారని ధ్వజమెత్తారు.

రెండోసారి అధికారంలోకి రాగానే రెవెన్యూ శాఖ గుప్పిట్లోకి.. అందుకేనా?

తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో కేసీఆర్ కుటుంబం, వారి బంధుగణం మాత్రమే విపరీతంగా బాగుపడ్డారని పొంగులేటి విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం హోదాలో కేసీఆర్ రెవెన్యూ శాఖను తనవద్దే అట్టిపెట్టుకోవడం వెనుక ఉన్న అసలు మతలబు భూముల అక్రమాలకు పాల్పడటమేనని ఆయన స్పష్టం చేశారు. ధరణిని అడ్డుపెట్టుకుని గత పాలకులు లక్షలాది ఎకరాలను దర్జాగా దోచుకున్నారని విమర్శించారు.

అసెంబ్లీలో బండారం బయటపడుతుందని ముఖం చాటేస్తున్నారా..

చేసిన అక్రమాలు, సాగించిన భూదందాల తాలూకు బండారం అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుకు వస్తుందన్న భయంతోనే గత పాలకులు సభ నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. నిజాలు నిప్పులాంటివని, ప్రజా ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ప్రతి ఎకరా లెక్క తేల్చి ప్రజల పక్షాన నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.

#Ponguleti Srinivasa Reddy#Telangana Politics#Telangana Assembly#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి