రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సహా మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు, బ్లాక్ టీషర్ట్స్ ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.తోపులాట సైతం నెలకొనడంతో అక్కడ విధి నిర్వహణలో ఉన్న తన పట్ల సదరు నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఈ మేరకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే వీరిపై పలు సెక్షన్ల కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన ఉద్రిక్తతల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తల్లిని అసభ్యపదజాలంతో దూషించిన కారణంగా ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను మండలి నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
దీనికి తోడు వీరిపై క్రమశిక్షణా చర్యలు కోసం ఎథిక్స్ కమిటీ విచారణ ప్రారంభించగా.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు.కాగా, బీఆర్ఎస్ నేతలు స్పీకర్ తల్లిని దూషించిన విషయం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. సభలో గందరగోళం నెలకొనడంతో బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.












