తెలంగాణ

24 గంటల కరెంట్ ఏదీ?.. రేవంత్ రెడ్డి స్వగ్రామంలో రైతుల మెరుపు ధర్నా..!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు అకస్మాత్తుగా మెరుపు ధర్నా చేపట్టారు. తమ పొలాలకు సరిపడా విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు అకస్మాత్తుగా మెరుపు ధర్నా చేపట్టారు. తమ పొలాలకు సరిపడా విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలన్నీ ఎండిపోయే’ అంటూ పాటలు పాడుతూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వంపై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది.

 వ్యవసాయానికి రోజూ కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, అది కూడా నాణ్యత లేకపోవడం వల్ల మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల విద్యుత్ ఇచ్చారని, మరి ఇప్పుడు ఆ రకమైన సరఫరా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయానికి ఉచితంగా, నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని వారు ఆరోపించారు.

 దీనికి తోడు తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అక్రమంగా తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం నోరు మెదపడం లేదని రైతులు మండిపడ్డారు. నీళ్లు, కరెంట్ రెండూ లేక కళ్లముందే పంట పొలాలు ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆవేదన చెందారు. తెలంగాణకు రావాల్సిన చట్టబద్ధమైన నీటి వాటాను తెచ్చుకోవడం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, తమ నీళ్లను తామే తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.

 తమ పంట పొలాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా పునరుద్ధరించే వరకు, సాగునీటి సమస్యను పరిష్కరించే వరకు ఈ ఆందోళనను ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేది లేదని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, సీఎం సొంత నియోజకవర్గం, గ్రామంలోనే రైతన్నలు రహదారిపై బైఠాయించి నిరసన తెలపడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

 

#Nagarkurnool#RevanthReddy#Kondareddypally#FarmersProtest#PowerCrisis#TelanganaPolitics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి