తెలంగాణ

Assembly Sessions: 22ఏ భూములపై పొలిటికల్ వార్‌.. అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ వాకౌట్!..

రచన: Venu6 నిమిషాల పఠనం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత 22ఏ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ తమ నిరసనలను మరింత ఉధృతం చేశాయి. సభలో ప్లకార్డులు, ఆందోళనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

తెలంగాణ రాజకీయాల్లో 22ఏ భూముల వివాదం ఇంకా రగులుతూనే ఉంది. భూముల సమస్యగా మొదలైన ఈ వ్యవహారం.. క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రాజకీయ అంశంగా మారింది. చివరకు అసెంబ్లీతో పాటు శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చకు దారితీసింది. ఇక రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉండాల్సిన భూములతో పాటు.. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూములు, ఇళ్లు, వ్యవసాయ భూములు కూడా 22ఏ జాబితాలో చేరాయనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది

దీంతో తమకు హక్కులు ఉన్న భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదే అంశాన్ని బీఆర్ఎస్, బీజేపీ రాజకీయంగా అందిపుచ్చుకున్నాయి. వేలాది కుటుంబాల ఆస్తి హక్కులతో ముడిపడిన ఈ సమస్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బీఆర్ఎస్ అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తూ.. 22ఏ జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

మరోవైపు బీజేపీ కూడా ప్రైవేటు భూములు 22ఏ జాబితాలోకి ఎలా వచ్చాయి.. ఎవరి నిర్ణయంతో వచ్చాయి.. వాటి వెనుక ఏం జరిగింది అనే విషయాలపై న్యాయ విచారణకు పట్టుబట్టింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారం వెనుక గతంలో ఉన్న రికార్డులు, అధికారుల స్థాయిలో జరిగిన తప్పిదాలు కూడా ఉన్నాయని వివరణ ఇచ్చింది. పాత నిషేధిత భూముల జాబితాలను అధికారులు ఉపయోగించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని చెబుతూ.. బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

అయినా ఈ వివాదం చల్లారలేదు.. మరోవైపు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత 22ఏ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ తమ నిరసనలను మరింత ఉధృతం చేశాయి. సభలో ప్లకార్డులు, ఆందోళనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై చర్చకు సిద్ధమని చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం న్యాయ విచారణతో పాటు పూర్తి స్థాయిలో బాధ్యులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాయి.

దీంతో 22ఏ భూముల వివాదం ఇప్పుడు కేవలం రెవెన్యూ సమస్యగా కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్–బీజేపీ రాజకీయ పోరుగా మారిపోయింది. ఇక తాజాగా ఇదే రగడ శాసనమండలికి చేరింది. నేడు సభ ప్రారంభం కాగానే 22ఏ భూములకు సంబంధించిన సమస్యలపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు.

అయితే మండలి చైర్మన్ ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభను సజావుగా సాగనివ్వాలని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చొని సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. మరోవైపు శాసనమండలిలో మార్షల్స్ వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమ డిమాండ్‌పై వెంటనే చర్చ చేపట్టకుండా సభను కొనసాగించడాన్ని నిరసిస్తూ చివరకు బీఆర్ఎస్ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. దీంతో 22ఏ భూముల వ్యవహారం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఈ భూముల సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది.. నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో అసలు బాధ్యత ఎవరిది.. ప్రభుత్వం ఎంతవరకు పరిష్కారం చూపుతుందనేది రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు ఊపందుకున్నాయి..

#Telangana#Assembly Sessions#BRS Walkout#Madhusudhana Chari#Sridhar Babu#22A Lands Issue
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి