తెలంగాణ

Telangana Politics: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కేటీఆర్ 'బాబు భజన' వెనుక అసలు కథ ఇదేనా!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Telangana Politics: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. కానీ ఉప్పు-నిప్పులా ఉండే బద్ధ రాజకీయ ప్రత్యర్థిని నిండు సభలో ఉన్నట్టుండి ఆకాశానికి ఎత్తేస్తే? అదీ తెలంగాణ గులాబీ పార్టీ టాప్ లీడర్ కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ‘దమ్మున్న నేత.. విజనరీ లీడర్’ అంటూ కితాబులిస్తే?

Telangana Politics: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. కానీ ఉప్పు-నిప్పులా ఉండే బద్ధ రాజకీయ ప్రత్యర్థిని నిండు సభలో ఉన్నట్టుండి ఆకాశానికి ఎత్తేస్తే? అదీ తెలంగాణ గులాబీ పార్టీ టాప్ లీడర్ కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ‘దమ్మున్న నేత.. విజనరీ లీడర్’ అంటూ కితాబులిస్తే? ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. నిన్నటి దాకా వైఎస్ జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ బాబుపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఉన్నపళంగా బాబు భజన మొదలుపెట్టడం వెనుక కేవలం ప్రశంస మాత్రమే ఉందా, లేక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందా అన్న చర్చ పీక్స్‌కు చేరింది.

బాబుకు కితాబు.. రేవంత్‌కు గుబులు

ఇటీవల మీడియా సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో కాక రేపుతున్నాయి. "ఎల్‌నినో ముంచుకొస్తున్నా ముందుచూపుతో రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసిన సమర్థుడు చంద్రబాబు.. శ్రీశైలం నుంచి ఏకంగా కుప్పం దాకా కృష్ణా జలాలను తీసుకెళ్లిన విజనరీ లీడర్" అంటూ బాబు పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, ఈ పొగడ్తల వెనుక అసలు టార్గెట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నది బహిరంగ రహస్యం. పక్కనే ఉన్న పాలమూరుకు చుక్క నీరు తేలేని రేవంత్ అసమర్థతను ఎండగట్టడానికే, ఆయన రాజకీయ గురువైన చంద్రబాబు ఘనతను తెరపైకి తెచ్చి కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేశారన్నది సుస్పష్టం.

ఎమ్మెల్సీ సమరం.. టార్గెట్ పట్టభద్రుల ఓటుబ్యాంక్

ఈ ఆకస్మిక ప్రేమాయణం వెనుక అసలు ‘గేమ్ ప్లాన్’ త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, అలాగే ఖమ్మం–నల్గొండ–వరంగల్ స్థానాలు ఇరు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులు, పట్టభద్రుల్లో సైబరాబాద్ రూపకర్తగా చంద్రబాబుపై సహజంగానే ఓ సానుకూల దృక్పథం ఉంది. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పరోక్షంగా పసుపు పార్టీ అభిమానుల బలం ఇప్పటికీ బలంగానే ఉంది. బాబును ప్రశంసించడం ద్వారా ఆ వర్గం ఓటర్లను, టీడీపీ సానుభూతిపరులను బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడం.. అదే సమయంలో రేవంత్ పాలనను తీసిపారేయడం కేటీఆర్ వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది.

వ్యూహం ఫలిస్తుందా?

గతంలో హైదరాబాద్ ఐటీ రంగ అభివృద్ధి ఘనతను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా బాబు పేరును వాడుకున్న కేటీఆర్, ఇప్పుడు ఏకంగా పాలన పరంగానే బాబును ఆదర్శంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్నటిదాకా సాగిన రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి కేటీఆర్ కురిపిస్తున్న ఈ అకస్మాత్తు ప్రశంసలను పట్టభద్రులు కేవలం ఎన్నికల గిమ్మిక్కుగా చూస్తారా? లేక రేవంత్‌కు వ్యతిరేకంగా ఈ ఎత్తుగడ గులాబీ పార్టీకి కలిసివస్తుందా? అన్నది రాబోయే ఎమ్మెల్సీ పోరులోనే తేలనుంది.

#Telangana Politics#KTR#Chandrababu Naidu#Revanth Reddy#BRS#Congress#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి