Women Safety: "ఆడపిల్లపై చెయ్యేస్తే వాడు ఇక సమాజంలో బతకడానికి వీల్లేదు.. ఉండడు కూడా!"— రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల భద్రతపై గట్టి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్మాదులు, సైకోల తీరు చూస్తుంటే ప్రభుత్వ హెచ్చరికలన్నా, పోలీసులన్నా కనీస భయం కనిపించడం లేదు. పాలకుల హెచ్చరికలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? వీధుల్లో దొరుకుతున్న గంజాయి, దగ్గు మందులు, వైట్నర్ల మత్తులో యువత విచక్షణ కోల్పోతోందా? అసలు ఇలాంటి నరరూప రాక్షసుల వెన్నులో చట్టం ఎందుకు వణుకు పుట్టించలేకపోతోంది?
కాగితాలపై చట్టాలు రాస్తే సరిపోదు..
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఇటీవల నిర్భయ తరహాలోనే ఓ యువతిపై జరిగిన అమానుష ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. కేవలం కాగితాలపై కేసులు రాసి, రూల్స్ రూపొందిస్తే నేరాలు ఆగవని, దుండగుల గుండెల్లో వణుకు పుట్టించేలా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
చంపేస్తారనే భయం ఉండాలి:
ఆడపిల్ల జోలికి వెళ్లాలన్నా, ఏదైనా అగాయిత్యానికి పాల్పడాలన్నా.. "మనం తప్పు చేస్తే చట్టం మనల్ని ప్రాణాలతో ఉంచదు, మనం చచ్చిపోతాం" అనే భయం నేరగాళ్లలో కలగాలని కోర్టు కుండబద్దలు కొట్టింది. నేరస్థులను కఠినంగా అణిచివేసేటప్పుడు మానవ హక్కులు, ఆర్టికల్ 21 (జీవించే హక్కు) పేరిట కొందరు గగ్గోలు పెడతారని, అలాంటి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు పోలీసులను చూసి పారిపోకూడదని, కేవలం నేరగాళ్లు మాత్రమే చట్టానికి భయపడాలని తేల్చిచెప్పింది.
ఎన్కౌంటర్లే ఏకైక పరిష్కారమా
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన హనుమకొండ యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ గానీ, హైదరాబాద్లోని ‘దిశ’ కేసు ఎన్కౌంటర్ గానీ గుర్తుచేసుకుంటే.. ఆ చర్యలపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనదా కాదా అన్న వాదనలు ఎలా ఉన్నా, ఆ తరహా తక్షణ కఠిన చర్యలే కొంతకాలమైనా నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించి, నేరాలు పునరావృతం కాకుండా అడ్డుకోగలిగాయన్నది పచ్చి నిజం. అనంతపురం ఘటనలో సైకో పారిపోయాడా లేక ఎన్కౌంటర్ అయ్యాడా అన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం వెనుక కూడా సమాజంలో గూడుకట్టుకున్న ఇలాంటి తీవ్ర ఆగ్రహమే కారణం అని చెబుతున్నారు.
మత్తు మహమ్మారి..
మరోవైపు రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా విస్తరిస్తున్న మత్తు సంస్కృతి నేరాలకు ఆజ్యం పోస్తోంది. గంజాయి కట్టడి చేశామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇంకా విచ్చలవిడిగా లభ్యమవుతోంది. స్టేషనరీ దుకాణాల్లో దొరికే వైట్నర్లు, మెడికల్ షాపుల్లోని దగ్గు మందులు సైతం నేటి యువతను ఉన్మాదులుగా మారుస్తున్నాయి. మత్తులో కళ్లు మూసుకుపోయిన సైకోలు విచక్షణ కోల్పోయి వికృత చేష్టలకు ఒడిగడుతున్నారు.
దీనికితోడు బాధితులకు తక్షణ అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రుల డొల్లతనం బట్టబయలవుతోంది. అనంతపురంలో దాడికి గురైన యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ వంటి అత్యవసర చికిత్స సదుపాయాలు లేకపోవడం శోచనీయం. చివరకు కర్ణాటక ప్రభుత్వ చొరవతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి బెంగళూరు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
ఉన్మాదులపై రాజీలేని ఉక్కుపాదం, మత్తు మాఫియాపై సమూల అణిచివేత, జిల్లా ఆసుపత్రుల్లో అత్యాధునిక అత్యవసర చికిత్స సౌకర్యాలు కల్పించడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. మాటల గారడీలు కాకుండా క్షేత్రస్థాయిలో చట్టం తన కరకుదనాన్ని చూపించినప్పుడే ఆడబిడ్డల భద్రతకు నిజమైన గ్యారెంటీ లభిస్తుంది.


