US Politics: అమెరికా రాజకీయాల్లో మధ్యంతర ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, వివాదాస్పద విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆయన ప్రజాదరణ ఏకంగా 38 శాతానికి పడిపోయిందని తేలడం సంచలనం రేపుతోంది.
ఈ మిడ్‌టర్మ్స్ ఎన్నికలు ట్రంప్ పాలనకు ప్రజా రెఫరెండంగా మారగా, యూఎస్ ప్రతినిధుల సభపై రిపబ్లికన్లు పట్టు కోల్పోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ విశ్లేషక సంస్థ ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ అంచనా ప్రకారం డెమోక్రాట్లు 227 సీట్లు గెలుచుకుని సభపై పట్టు సాధించనున్నారు. అటు ‘సీబీఎస్ న్యూస్’ సర్వే డెమోక్రాట్లకు 229 సీట్లు దక్కుతాయని స్పష్టం చేయగా, ‘కుక్ పొలిటికల్ రిపోర్ట్’ సైతం వారికి కనీసం 220 స్థానాలు ఖాయమని తేల్చింది. అయితే ఎగువ సభ అయిన సెనెట్‌లో మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.
ట్రంప్ తీసుకున్న పలు కఠిన అంతర్జాతీయ, ఆర్థిక నిర్ణయాలే రిపబ్లికన్లకు ప్రతికూలంగా మారాయి. ఇతర దేశాలపై విధించిన టారిఫ్ యుద్ధాలు, ఇరాన్‌తో ముదిరిన యుద్ధ వాతావరణం, దౌత్యపరమైన సంక్షోభాలు సామాన్య ఓటర్లను కలవరపెడుతున్నాయి. వీటికితోడు నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తుండటంతో, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, విదేశీయులపై అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు మధ్యతరగతి అమెరికన్లలో తీవ్ర అసంతృప్తిని రాజేశాయి.
సర్వేలు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం తన ఆఖరి అస్త్రమైన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదాన్నే నమ్ముకుని ప్రచారం సాగిస్తున్నారు. రిపబ్లికన్ల పట్టున్న రెడ్ స్టేట్స్పై ప్రధానంగా దృష్టి పెట్టి ర్యాలీలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓటర్ల ఆగ్రహం ముందు ఈ ప్రచారం ఎంతవరకు పనిచేస్తుంది? సర్వేల జోస్యాలు నిజమై డెమోక్రాట్లు పాగా వేస్తారా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.


