Congress Party: తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల అలకలు, అంతర్గత కుమ్ములాటలు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజానికెత్తుకోవాల్సిన ఇద్దరు ‘సూపర్ సీనియర్’ మంత్రులు.. ఎన్నికలను ఏమాత్రం పట్టించుకోకుండా ‘లైట్’ తీసుకోవడం ఇప్పుడు గాంధీభవన్‌తో పాటు ఏఐసీసీ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. వారి వైఖరితో విసిగిపోయిన పీసీసీ నాయకత్వం.. చివరకు అధిష్టానానికే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అదిలించలేరు.. బతిమాలినా వినరు
సదరు మంత్రులు కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఉన్న ఉద్దండులు, ‘సూపర్ సీనియర్లు’ కావడంతో రాష్ట్ర నాయకత్వానికి వారిని గట్టిగా అదిలించే ధైర్యం చాలడం లేదు. పోనీ బతిమాలి దారికి తెచ్చుకుందామా అంటే వారి తీరు ఏమాత్రం మారడం లేదని సమాచారం. ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని పార్టీ ఎన్నిసార్లు కోరినా.. కేవలం మొక్కుబడి సమీక్షలు, నామమాత్రపు సమావేశాలతోనే మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. "మేము పనిచేయకపోతే పీకేదేముంది?" అన్న ధోరణిలో వారు ఉన్నారని, తమతో భేటీ అయ్యే ద్వితీయ శ్రేణి కేడర్‌తో "మాపైనే ఢిల్లీకి ఫిర్యాదులు చేస్తారా?" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఆ ఇద్దరు నేతలు ఎవరు? తెరవెనుక ఏం జరుగుతోంది?
పీసీసీ నాయకత్వం అధిష్టానానికి పంపిన రహస్య నివేదికలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక మంత్రుల పేర్లే ప్రధానంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం సీనియర్ మంత్రి తీరుపై అనుమానాలు వినిపిస్తున్నాయి. జిల్లాతో ప్రత్యక్ష సంబంధమున్న ఒక కుటుంబానికి చెందిన అభ్యర్థికే అధిష్టానం టికెట్ కేటాయించినప్పటికీ, ఈ సీనియర్ మంత్రి మాత్రం ప్రచారానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. కనీసం మండల, నియోజకవర్గ స్థాయి కేడర్‌ను సమాయత్తం చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అభ్యర్థి ఎంపిక ఆయనకు సుతరామూ ఇష్టం లేదా? లేక ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడుతున్నారా? అన్న ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.
ఇక ఉమ్మడి నల్గొండలో పరిస్థితి మరింత విచిత్రంగా ఉందట. అధికారిక అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా.. ఏకంగా ‘పోటీ నుంచి తప్పుకో’ అని స్వయంగా సదరు అభ్యర్థికే ఆ మంత్రి ఉచిత సలహా ఇచ్చినట్లు జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థిని అచేతనం చేసేలా వ్యవహరిస్తుండటంతో కేడర్ అయోమయంలో పడిపోయింది.
ఢిల్లీ చేరిన పంచాయితీ.. అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా?
రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు జోక్యం చేసుకుని ఇద్దరు మంత్రులతో రాయబారాలు నడిపినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధికార బలం, యంత్రాంగం చేతిలో ఉన్న సమయంలో కూడా సొంత పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరించకుండా వ్యవహరిస్తున్న ఈ వ్యవహారంపై పీసీసీ గుర్రుగా ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో చేసేదేమీ లేక మొత్తం ఉదంతాన్ని అధిష్టానం ముందుంచింది. మరి ఈ ‘సూపర్ సీనియర్ల’ సైలెంట్ రాజకీయానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలా చెక్ పెడుతుంది? హెచ్చరికలతో సరిపెడుతుందా లేక గట్టి చర్యలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.


