హైదరాబాద్ నగరంలో దారుణంగా సాగుతున్న అంతర్రాష్ట్ర అండాల (Egg Donation) అక్రమ సేకరణ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అండాలను అక్రమంగా సేకరిస్తూ ఐవీఎఫ్ (IVF), ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో బేగంపేట్, సరూర్‌నగర్ పోలీసులు, మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడులలో 43 మంది మహిళలను నిందితుల చెర నుంచి విడిపించారు.
పోలీసులు ప్రకాశ్ నగర్, బేగంపేట్, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లోని పలు స్థావరాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పేద మహిళలను ఏజెంట్లు ఇక్కడికి రప్పిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఒక్కో అండం సేకరణకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఇస్తామని ఆశ చూపి, హైదరాబాద్‌లోని అద్దె ఇళ్లలో ఉంచి ఫెర్టిలిటీ సెంటర్లకు తరలిస్తున్నారు. అండాల ఉత్పత్తి కోసం మహిళలకు బలవంతంగా ప్రమాదకర హార్మోన్ల ఇంజెక్షన్లు, మాత్రలు ఇస్తున్నట్లు బాధితులు పోలీసుల ఎదుట వాపోయారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా భారీగా హార్మోన్ల ఇంజెక్షన్లు, సిరంజిలు, మందులతో పాటు కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు అమిత్ శర్మ (44), మహిళలను రిక్రూట్ చేసే సహ నిర్వాహకురాలు నిక్కత్ పర్వీన్ (31) సహా ఏజెన్సీ ప్రతినిధులు, ఏఆర్‌టీ (ART) బ్యాంక్ మేనేజర్లతో కలిపి మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అమిత్ శర్మ ప్రకాశ్ నగర్‌లో నెలకు రూ.50వేల అద్దె చెల్లిస్తూ గత రెండేళ్లుగా ఈ అక్రమ దందాను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
బాధిత మహిళల పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ అఫిడవిట్లు, అంగీకార పత్రాలు సృష్టించి ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రాకెట్‌తో సంబంధమున్న పలు ప్రముఖ ఐవీఎఫ్ సెంటర్లు, ఏఆర్‌టీ బ్యాంకుల పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంపై బేగంపేట్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. నూతన భారతీయ న్యాయ సంహిత (BNS), అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) రెగ్యులేషన్ యాక్ట్ కింద తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.


