తెలంగాణ

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ 'రైతు గర్జన'.. కేటీఆర్ సుడిగాలి పర్యటన!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు (ఆదివారం) ఆదిలాబాద్ జిల్లాలో బిజీ బిజీగా పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన ‘రైతు గర్జన’ సభలకు శ్రీకారం చుట్టనున్నారు.

 మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు (ఆదివారం) ఆదిలాబాద్ జిల్లాలో బిజీ బిజీగా పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన ‘రైతు గర్జన’ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నార్సింగి నివాసం నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గాన ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ఆయన పయనమయ్యారు.

ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ మధ్యాహ్నం 1 గంటకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ భోజనం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బోథ్ నియోజకవర్గం సరిహద్దులోని నేరడిగొండ వద్దకు చేరుకోగా, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఆయనకు అత్యంత ఘనంగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నేరుగా పయనించి సాయంత్రం 4 గంటలకు బోథ్ నియోజకవర్గం తలమడుగు మండల కేంద్రానికి చేరుకుంటారు.

 తలమడుగులో ఇటీవల వివిధ కారణాలతో, పంట నష్టంతో ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి కేటీఆర్ పరామర్శించనున్నారు. ప్రభుత్వ పరంగా రైతు భరోసా, రైతు బీమా అందించడంలో జరుగుతున్న జాప్యంపై ఆరా తీసి, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దత్తత జిల్లాగా ప్రచారం పొందుతున్న ప్రాంతంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడంపై బీఆర్ఎస్ ఈ పర్యటన ద్వారా సీరియస్‌గా దృష్టి సారించింది.

 అనంతరం సాయంత్రం 6 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కాలేజ్ గ్రౌండ్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ’రైతు గర్జన’ భారీ బహిరంగ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవసాయ సంక్షోభంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తేందుకు బీఆర్ఎస్ సమాయత్తమైంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

#KTRAdilabadTour2026#RythuGarjanaAdilabad#KTRAdilabadSchedule#BRSFarmersRally#AnilJadhavMLA#TelanganaPoliticsTelugu#TelanganaNewsTelugu#BRSVsCongress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి