తెలంగాణ

తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. సన్న బియ్యం ధరలకు చెక్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో నాణ్యమైన సన్న బియ్యం ధరల విచ్చలవిడి పెరుగుదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి అడ్డుకట్ట వేసింది. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, అక్రమ నిల్వల ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతూ ధరలు పెంచుతున్నారనే ఫిర్యాదులపై పౌరసరఫరాల శాఖ తీవ్రంగా స్పందించింది.

 రాష్ట్రంలో నాణ్యమైన సన్న బియ్యం ధరల విచ్చలవిడి పెరుగుదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి అడ్డుకట్ట వేసింది. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, అక్రమ నిల్వల ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతూ ధరలు పెంచుతున్నారనే ఫిర్యాదులపై పౌరసరఫరాల శాఖ తీవ్రంగా స్పందించింది. వినియోగదారులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు గాను వివిధ రకాల సన్న బియ్యం గరిష్ఠ చిల్లర ధరలను (MRP) ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 మిల్లర్లు, ప్రధాన వ్యాపారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పరిమితిని అధికారికంగా నిర్ణయించారు. పౌరసరఫరాల శాఖ ఆదేశాల ప్రకారం.. బీపీటీ (BPT), కేఎన్ఎమ్ (KNM) రకం బియ్యం కిలోకు గరిష్ఠంగా రూ.66, తెలంగాణ సోనా, ఆర్‌ఎన్ఆర్ (RNR) రకాలు రూ.74, హెచ్ఎమ్‌టీ (HMT), జేఎస్ఆర్ (JSR) రకాలు రూ.79మించకుండా విక్రయించాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరల పట్టికను ప్రతి బియ్యం దుకాణంలో వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా బోర్డులపై తప్పనిసరిగా ప్రదర్శించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.

 ఇటీవలి కాలంలో మార్కెట్‌లో నాణ్యమైన సన్నబియ్యం కిలో రూ.75 నుంచి ఏకంగా రూ.95 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారుల తనిఖీలు తీవ్రతరం అయ్యాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ అధికారులు జరిపిన తనిఖీల్లో తూకాల్లో తేడాలు, ఎంఆర్‌పీ స్టిక్కర్ల ట్యాంపరింగ్, అధిక ధరలకు అమ్మడం వంటి ఉల్లంఘనలపై 6 కేసులు నమోదు చేశారు.

 ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వినియోగదారులను మోసం చేసే వ్యాపారులపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act) కింద కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో ముందస్తుగా ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

#TelanganaRicePrices2026#UttamKumarReddyWarning#BPTRicePrice66#CivilSuppliesTelangana#RicePriceCapTelangana#TelanganaNewsTelugu#HydNewsTelugu#KukatpallyRaids
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి