Kollywood: సాయి పల్లవి అంటేనే సహజమైన నటనకు కేరాఫ్ అడ్రస్. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యతను ఇచ్చే ఈ నేచురల్ బ్యూటీ, వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఎలాంటి హడావుడి లేకుండా పూర్తి చేసిందనే వార్త ఆసక్తికరంగా మారింది.
మణిరత్నం సినిమాల్లో నటించడం అనేది ఏ నటినటులకైనా ప్రత్యేకమైన అనుభవమే. ఆయన సినిమాల్లో పాత్రలకు, నటనకు ఉండే ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దర్శకుడి సినిమాలో సాయి పల్లవి భాగం కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక, ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా మణి రత్నం రూపొందిస్తున్నారు. కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జ్ సహా పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపారని సమాచారం.
గతంలో దర్శకుడు మణి రత్నం ఇంత త్వరగా ఏ సినిమాను పూర్తి చేసింది లేదు. అలాంటి, ఇద్దరు బిజీ స్టార్స్‌తో కూడా కేవలం మూడు నెలల్లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జూలై నుంచి చిత్రీకరణ మొదలుపెట్టి అక్టోబర్ వరకూ కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఇటూ సాయి పల్లవి ఓం, రామాయణ సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ సేతుపతి కూడా తన ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నాడు. అయినా, పక్కా షూటింగ్ షెడ్యూల్స్‌తో ఎలాంటి హడావిడి లేకుండా మణి రత్నం ఈ సినిమాను పూర్తి చేశాడు.
ఇక, మణిరత్నం సినిమాలకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఇంజి వెల్లం' అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్ని భారీ చిత్రాలు పోటీ ఉన్నా 2027, సంక్రాంతి బరిలో మణి రత్నం ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇంతకముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. మరి, ఈ మూవీతోనైనా మణి రత్నం సాలీడ్ కంబ్యాక్ ఇస్తాడా అన్నది చూడాలి.


