Gold Hallmark Charges : ధంతేరస్ పండుగ వేళ బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొండంత పెరిగిన ధరల వల్ల లక్షలు వెచ్చించి పెద్ద పెద్ద ఆభరణాలు కొనలేని సామాన్యులు.. ఒక గ్రాము, రెండు గ్రాముల బంగారు నాణేలు, చిన్న చిన్న ఉంగరాలు లేదా అరగ్రాము వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా తక్కువ పరిమాణంలో గోల్డ్ కొనుగోలు చేసే వారి అమాయకత్వాన్ని కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. రూల్స్‌పై అవగాహన లేకపోతే ఈ చిన్న కొనుగోళ్లపైనే వినియోగదారులు అడ్డంగా మోసపోయే ప్రమాదముంది.
బిల్లులో హాల్‌మార్క్ ఛార్జీ ఉంటే చెల్లించకండి
చిన్న సైజు బంగారు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు చాలామంది బిల్లును క్షుణ్ణంగా పరిశీలించరు. ఇదే అదనుగా భావించే కొందరు దుకాణదారులు బిల్లులో గుట్టుచప్పుడు కాకుండా 'హాల్‌మార్క్ ఛార్జీలు' జోడించేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం.. రెండు గ్రాముల లోపు బరువు ఉండే ఎలాంటి బంగారు ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్క్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఉంది. అంతేకాదు, బంగారు నాణేలు (కాయిన్స్), బిస్కెట్లు, బార్లు, వాచీలు, ఫౌంటెన్ పెన్నులతో పాటు కుందన్, పోల్కి, జడావు వంటి ప్రత్యేక ఆభరణాలపై కూడా ఈ రుసుము వసూలు చేయకూడదని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి 1 లేదా 2 గ్రాముల బంగారం కొన్నప్పుడు మీ బిల్లులో ఈ ఛార్జీ కనిపిస్తే అస్సలు కట్టకండి.. వెంటనే దాన్ని తొలగించమని గట్టిగా అడగండి.
రూల్స్ పేరుతో దోపిడీకి చెక్
2021లో కేంద్ర ప్రభుత్వం బంగారానికి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. ఇటీవల బీఐఎస్ నిబంధనల ప్రకారం.. అర్హత ఉన్న ఒక్కో పెద్ద ఆభరణానికి హాల్‌మార్క్ ఛార్జీని రూ.45 నుంచి రూ.75కు పెంచారు. ఈ ఛార్జీ కేవలం నిర్దేశిత బరువున్న పెద్ద నగలకే వర్తిస్తుంది. కానీ కస్టమర్లకు ఈ రూల్స్ తెలియవన్న ధీమాతో, మినహాయింపు ఉన్న 1 గ్రాము, 2 గ్రాముల కాయిన్లు, చిన్న వస్తువులపై కూడా ఈ రూ.75 అదనంగా బాదేస్తున్నారు. పండుగ పూట అదృష్టం తెస్తుందని ఆశగా బంగారం కొనే సామాన్యులు ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. షాపులో బిల్లు తీసుకున్న వెంటనే అందులో తరుగు, మజూరీలతో పాటు ఏమైనా అనవసర ఛార్జీలు వేశారా అన్నది నిశితంగా చూసుకోవడం చాలా అవసరం.


