India Fuel Rates: నిత్యం పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యుడికి త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో తీపి కబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అనూహ్యంగా దిగిరావడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఎదురుదెబ్బ తినడం, ఫలితంగా ఇరాన్‌తో యుద్ధ వాతావరణం ముగిసి శాంతి నెలకొంటుందన్న సంకేతాలు రావడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు మంటలు ఒక్కసారిగా చల్లారాయి.
వంద డాలర్ల దిగువకు ముడి చమురు
గత అక్టోబర్ తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్ల మార్క్ కంటే కిందకు పడిపోయింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 4.7 శాతం తగ్గి బ్యారెల్‌కు 98.76 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ 91.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధమే తమ పార్టీ ఓటమికి కారణమని ట్రంప్ అంగీకరించడం, ప్రస్తుతానికి తక్షణ దాడుల ప్రణాళికలు ఏవీ లేవని ప్రకటించడంతో మార్కెట్లలో ఆందోళన తగ్గింది. దీనికితోడు గల్ఫ్ దేశాల నుంచి రోజుకు 17.1 మిలియన్ బ్యారెళ్ల ఎగుమతులు సాగుతుండటం, హర్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా అరబ్ దేశాలు ప్రత్యామ్నాయ పైప్‌లైన్లపై దృష్టి పెట్టడంతో గ్లోబల్ మార్కెట్‌కు చమురు సరఫరా గణనీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మన దేశంలో ధరలు తగ్గే అవకాశం ఎంతవరకు..
భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏకంగా 80 శాతానికి పైగా ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం సహజం. అయితే ఇప్పటివరకు ముడి చమురు ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉండటం వల్లే కేంద్ర ప్రభుత్వం లేదా చమురు కంపెనీలు ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఇప్పుడు ధరలు స్థిరంగా 100 డాలర్ల దిగువన కొనసాగితే, ఆ ప్రయోజనాన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు కేవలం ముడి చమురుపైనే కాకుండా రూపాయి మారకం విలువ, శుద్ధి ఖర్చులు, చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకాలపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ అంతర్జాతీయంగా ఈ తగ్గుదల ధోరణి మరికొద్ది రోజులు స్థిరంగా కొనసాగితే మాత్రం, వాహనదారులకు భారీ ఊరట లభించడం ఖాయంగా కనిపిస్తోంది.


