Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ రైతులపై కక్ష కట్టిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్లు ఉన్నా ఎత్తలేదని.. ఉన్న మంజీరాను ఖాళీ చేసి.. రైతులపై పగబట్టినట్లు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో అపాయింట్ మెంట్ కే రేవంత్ కు మూడేళ్లు పట్టిందని.. వాళ్లు అనుమతి ఇచ్చేది ఎప్పుడు, మీరు తమ్మిడిహట్టి కట్టేది ఎప్పుడు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
రైతులకు తక్షణ సాయం ప్రకటించాలి
తమ్మిడిహట్టి పేరుతో మూడేళ్లు డ్రామాలు ఆడారని సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. రైతులకు కావాల్సింది మీ ప్రెస్ మీట్లు, తిట్లు, బోగస్ మాటలు కాదు.. రైతులకు కావాల్సింది ఎండిన పంటలకు సాయం కావాలి, వారిని ఆదుకోవాలి అని అన్నారు. మీ నోటి మాటలతో రైతుల కడుపు నిండదన్నారు. మహారాష్ట్ర, కర్నాటక తరహాలో రైతులకు తక్షణ సాయం ప్రకటించాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు హరీశ్ రావు. రాజకీయాలు మాని వెంటనే రైతులను ఆదుకోవాలని హితవు పలికారు.
గ్లోబల్ సమ్మిట్ కు పైసలు ఉంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా?
గ్లోబల్ సమ్మిట్ కేమో డెడ్ లైన్స్ పెట్టారు.. మరి రైతులను ఆదుకోవడానికి టైమ్ లైన్స్ ఎందుకు పెట్టరు? రైతులకు సాయం చేయడానకి ఎందుకు గడువు పెట్టరు? అని ముఖ్యమంత్రి రేవంత్ ను ప్రశ్నించారు. రైతులకు భరోసా ఇవ్వని క్యాబినెట్ గ్లోబల్ సమ్మిట్ గురించి మాత్రం గొప్పులు చెప్పుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతుంటే.. వాళ్లకు భరోసా ఇవ్వని క్యాబినెట్ కూడా క్యాబినెట్టేనా? అని దుయ్యబట్టారు. ''గ్లోబల్ సమ్మిట్ కోసం విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.. అందుకు మీ దగ్గర పైసలు ఉన్నాయి.. కానీ, చనిపోయిన రైతుల కుటుంబాలకు సాయం చేయడానికి, రైతు బీమా అమలుకు, 5లక్షలు ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవా?'' అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు హరీశ్ రావు. రైతు బీమా రద్దు చేసి 6 నెలలు అవుతోందని వాపోయారు.
రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెచ్చిన కరువు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో కరెంటు కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోయిన వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హరీశ్ రావు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అతివృష్టి, అనావృష్టి కాదు తెలంగాణలో ఉన్నది రేవంత్ వృష్టి అని విరుచుకుపడ్డారు. వర్షాలు పడ్డా, నదుల్లో నీళ్లున్నా.. నీళ్లు ఎత్తకపోవడం వల్ల వచ్చిన కరువు ఇది. ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల గొంతు తడపడం కంటే బీరు కంపెనీలకు నీళ్ళు ఇవ్వడమే ప్రాధాన్యతగా మారిందని విమర్శించారు హరీశ్ రావు. ప్రజలు, హాస్టళ్ల అవసరాలకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకుంటే సీజ్ చేస్తున్నారు.. బీర్ ఫ్యాక్టరీలకు ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేయడాన్ని మాత్రం అనుమతిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని.. కరెంటు, నీళ్ళు లేక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని హరీశ్ రావు వాపోయారు.
ఇది అనావృష్టి కాదు.. రేవంత్ రెడ్డి వృష్టి
''ఇది.. కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.. ఇది అనావృష్టి కాదు.. రేవంత్ రెడ్డి వృష్టి. అలా అనడానికి మన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండో ఉదాహరణ. మూడోది మన జిల్లానే.. సింగూరు. నిండా నీళ్లు ఉంటే, 20 టీఎంసీలు ఉంటే.. దాన్ని అనవసరంగా తెగ్గొటి నీళ్లను విడిచిపెట్టారు. నదుల్లో నీళ్లు ఉన్న ఎత్తకపోవడాన్ని రేవంత్ వృష్టి అంటున్నాం. దేవాదులలో 60 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా 18 టీఎంసీలే ఎత్తారు. రేవంత్ రెడ్డి నీళ్లు విడిచిపెడితే చంద్రబాబు ఒడిసి పట్టుకున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. రేపు అసెంబ్లీలోనూ ఇదే చెబుతాం..ఆధారాలతో నిరూపిస్తాం. ఉన్న నీళ్లు విడిచిపెట్టారు, రిపేర్లు చేయలేదు.. మరి, ఇది కాలం తెచ్చిన కరువు ఎలా అవుతుంది? ఇది అనావృష్టి ఎలా అవుతుంది? మీ తెలివి తక్కువతో నాలుగు జిల్లాలకు మంచి నీళ్లు లేకుండా చేశారు'' అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు హరీశ్.


