International

80s ఫొటోల ట్రెండ్.. పర్యావరణానికి ఎంత ముప్పో తెలుసా?

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

సోషల్ మీడియా వినియోగంతో స్కామర్ల నుంచి ముప్పు అని విన్నాం కానీ, పర్యావరణానికి ముప్పు కలగడం ఏంటని అనుకుంటున్నారా? అవును.. నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌తో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో '1980ల నాటి ఏఐ ఫోటోల' (80s AI Trend) ట్రెండ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 సోషల్ మీడియా వినియోగంతో స్కామర్ల నుంచి ముప్పు అని విన్నాం కానీ, పర్యావరణానికి ముప్పు కలగడం ఏంటని అనుకుంటున్నారా? అవును.. నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌తో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో '1980ల నాటి ఏఐ ఫోటోల' (80s AI Trend) ట్రెండ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. తమ సాధారణ సెల్ఫీలను అప్‌లోడ్ చేసి, 80వ దశకం నాటి రెట్రో లుక్, వింటేజ్ దుస్తులు, పాతకాలపు హెయిర్‌స్టైల్స్‌తో కూడిన చిత్రాలుగా మార్చుకునేందుకు నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు.

 అయితే, ఎంతో సరదాగా అనిపించే ఈ డిజిటల్ ట్రెండ్ వెనుక పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే ప్రమాదకరమైన వాస్తవాలు దాగి ఉన్నాయని అంతర్జాతీయ టెక్నాలజీ, పర్యావరణ నిపుణులు ఘాటుగా హెచ్చరిస్తున్నారు. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మరియు హగ్గింగ్ ఫేస్ సంస్థల పరిశోధనా వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఒక్క చిత్రాన్ని జనరేట్ చేయడానికి 0.01 నుంచి 0.29 కిలోవాట్-హవర్ల విద్యుత్ వినియోగమవుతుంది.

 యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ (UNU) నివేదికను ఆధారం చేసుకుని విశ్లేషిస్తే, ఇది ఒక 10-వాట్ LED బల్బును దాదాపు 17 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగించడంతో సమానం. సాధారణ టెక్స్ట్ కమాండ్‌తో పోలిస్తే ఏఐ ఇమేజ్ సృష్టికి ఏకంగా 1,450 రెట్లు అధిక ఇంధన శక్తి అవసరమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ మాత్రమే కాకుండా, ఈ ఏఐ ట్రెండ్ వల్ల నీటి వనరులు కూడా భారీగా ఖర్చవుతున్నాయి. ఏఐ మోడళ్లను నడిపే భారీ డేటా సెంటర్లలోని సూపర్‌కంప్యూటర్లు, సర్వర్లు వేడెక్కకుండా చల్లబరిచేందుకు (కూలింగ్ ప్రాసెస్) విరివిగా నీటిని వినియోగిస్తున్నారు.

 ఒక సాధారణ ఏఐ చిత్రం తయారీకి 29 మిల్లీలీటర్ల నీరు అవసరమవుతుందని, లక్షలాది మంది కోట్లాది చిత్రాలను సృష్టించడం వల్ల కోట్ల లీటర్ల నీరు వృథా అవుతోందని అంచనా వేశారు. 2027 నాటికి అంతర్జాతీయంగా ఏఐ రంగం ఏకంగా 4.2 నుంచి 6.6 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వాడే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఒక ఫొటో క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాకపోయినప్పటికీ, అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ ట్రెండ్‌గా మారినప్పుడే పర్యావరణంపై తీవ్ర భారం పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఈ పర్యావరణ ముప్పును నివారించేందుకు టెక్ దిగ్గజాలు తక్షణమే సమర్థవంతమైన ఏఐ మోడళ్లను రూపొందించాలని సూచిస్తున్నారు. డేటా సెంటర్ల నిర్వహణకు పునరుత్పాదక ఇంధనాన్ని (సౌర, పవన విద్యుత్) వాడటంతో పాటు, నీటి అవసరం లేని అధునాతన కూలింగ్ టెక్నాలజీలను అవలంభించాలని స్పష్టం చేస్తున్నారు. పర్యావరణ ముప్పు విషయం తెలిసిన కొందరు నెటిజన్లు 80s ట్రెండింగ్ ఫొటోలకు పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా వినియోగం ఒక పరిమితి వరకు ఉంటే ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.

#AITrend#80sAIFilter#EnvironmentalImpact#TechNews#EnergyConsumption#WaterCrisis#ArtificialIntelligence#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి