స్వేచ్ఛ న్యూస్,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు జేసీబీ సాయంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకివెళితే.. గద్వాలకు చెందిన రంగముని అనే యువకుడు మహేశ్వరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రంగముని హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తుండగా..ఇదే ఊరికి చెందిన అమ్మాయి మహేశ్వరి కూడా హైదరాబాద్‌లోనే డిగ్రీ చదువుతోంది. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు.
అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరని ముందే నిర్ణయానికి వచ్చిన యువతీయువకుడు.. మేజర్లు కావడంతో బుధవారం పెళ్లి చేసుకొని మాసబ్ ట్యాంక్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ చేశారు.ఈ క్రమంలోనే ఆవేశంలో ఉన్న అమ్మాయి తరఫు బంధువులు, కుటుంబీకులు.. అబ్బాయికి చెందిన ఇంటితో పాటు అతని బాబాయ్ ఇంటిని సైతం కూల్చివేశారు.
అయితే, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.గద్వాల మండలం రేపల్లి గ్రామంలో ఈ నెల 10న వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనపై గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
ఈ కేసులో టీ. వీరన్న, పరశురాములు @ పరుష, వెంకటేష్ @ టీ. వెంకటేష్ నాయుడు, పరశురాములు, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్న @ తిమ్మప్పలను శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితులను అలంపూర్ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి న్యాయ రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.









