జీతం ప్రజలది.. పని చేసేది కాంగ్రెస్ పార్టీకా?
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
ఎంపీ చామల పోస్ట్‌తో బయటపడ్డ వ్యవహారం
విమర్శలు రావడంతో ఫొటో డిలీట్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్
ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో జీతం తీసుకుంటున్న సీఎం సీపీఆర్వో మల్సూర్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయడం విమర్శలకు దారి తీసింది. బాధ్యతలు మరచి పార్టీకి సలహాదారు మాదిరిగా కాంగ్రెస్ నేతలకు పాఠాలు చెప్పడంపై ప్రతిపక్ష నేతలతోపాటు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, అధికార పార్టీకి మధ్య ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన హద్దులను చెరిపేసి, టీవీ డిబేట్లలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలో గాంధీ భవన్‌లో మల్సూర్ క్లాసులు తీసుకున్నారు. ఈ విషయాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
పార్టీ మీడియా మీటింగ్‌లో సీపీఆర్వో మల్సూర్ పాల్గొన్న ఫొటోను ఆయన పంచుకున్నారు. రాజకీయ అంశాలు, మీడియా డిబేట్లు, ప్రెస్‌మీట్లలో ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపై సీఎం రేవంత్ సీపీఆర్వో మల్సూర్, హరిప్రసాద్‌తో చర్చించామని చామల చెప్పారు. వారి సూచనలు ఎంతో విలువైనవని చాలా గొప్పగా రాసుకొచ్చారు. ప్రభుత్వ హోదాలో ఉంటూ రాజకీయ పార్టీ వ్యూహాల్లో పాలుపంచుకోవడం ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను బేఖాతరు చేయడమేననే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎంపీ సదరు ఫొటోను డిలీట్ చేశారు.












